తెలుగు న్యూస్  /  Lifestyle  /  15 Year Public Provident Fund Account Ppf Features And Tax Benefits

PPF | పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకంలో ఎలా చేరాలి? ప్రయోజనాలేంటి?

28 February 2022, 16:00 IST

    • Public Provident Fund Account (PPF ) | ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. పొదుపుపై, రాబడిపై పన్ను మినహాయింపు వర్తించడంతో పాటు, నెలవారీ క్రమానుగత పొదుపు, దీర్ఘకాలిక పొదుపు కారణంగా మీ భవిష్యత్తు అవసరాలు తీరుతాయి. ఈ పథకం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పీపీఎఫ్ : క్రమానుగత పొదుపు సాధనం
పీపీఎఫ్ : క్రమానుగత పొదుపు సాధనం (unsplash)

పీపీఎఫ్ : క్రమానుగత పొదుపు సాధనం

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా 15 ఏళ్ల పాటు లాకిన్ పీరియడ్ కలిగి ఉంటుంది. అంటే మీరు ఖాతా తెరిచినప్పటి నుంచి 15 ఏళ్ల తరువాత మెచ్యూరిటీ ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వార్షిక వడ్డీ అందుతోంది.  పీపీఎఫ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 పొదుపు చేయాలి. గరిష్టంగా రూ. 1,50,000 వరకు మాత్రమే పొదుపు చేయవచ్చు. పొదుపు నెలనెలా చేయొచ్చు. లేదా ఏడాదిలో ఒకేసారి జమ చేయవచ్చు. పోస్టాఫీస్‌లో గానీ, బ్యాంకులో గానీ పీపీఎఫ్ ఖాతా తెరవవచ్చు.

పీపీఎఫ్ ప్రత్యేకతలు ఇవీ..

వయోజన భారతీయులు ఎవరైనా ఈ ఖాతా తెరవవచ్చు. ఒక మైనర్ పక్షాన సంరక్షకుడు ఖాతా తెరవవచ్చు. పోస్టాఫీస్ ద్వారా అయినా, బ్యాంక్ ద్వారా అయినా దేశవ్యాప్తంగా ఒక్కరికి ఒకే ఖాతా ఉండాలి.  ఈ పీపీఎఫ్‌లో చేసే పొదుపు మొత్తానికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సీ పరిధిలో పన్ను రాయితీ కోరవచ్చు.

ఖాతా ఎప్పుడు నిలిచిపోతుంది?

ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 జమ చేయని పక్షంలో పీపీఎఫ్ ఖాతా నిలిచిపోతుంది. నిలిచిపోయిన ఖాతాపై లోన్ గానీ, ఉపసంహరణ వెసులుబాటు గానీ ఉండదు. నిలిచిపోయిన ఖాతాను మెచ్యూరిటీ కాలవ్యవధికి ముందు పునరుద్ధరించుకోవచ్చు. అంటే నిలిచిపోయిన కాలానికి ప్రతి ఏడాదికి కనీసం రూ. 500 చొప్పున జమచేయాల్సి ఉంటుంది. 

వడ్డీ రేటు ఎప్పటికప్పుడు మారుతుంటుంది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేటును నోటిఫై చేస్తుంది. ఖాతాపై వచ్చిన వడ్డీ ప్రతి ఆర్థిక సంవత్సరం చివరన అదే ఖాతాలో జమవుతుంది. 

రుణం తీసుకోవచ్చా?

పీపీఎఫ్ ఖాతా తెరిచిన ఆర్థిక సంవత్సరం ముగిసిన అనంతరం ఏడాది గడిచాక మరుసటి ఏడాది లోన్ తీసుకోవచ్చు. అంటే 2021-22లో ఖాతా తెరిస్తే 2023-24 లో లోన్ తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన సంవత్సరం ముగిశాక, తదుపరి ఆర్థిక సంవత్సరం గడిచాక ఐదేళ్ల లోపు లోన్ తీసుకోవచ్చు. ఒక ఏడాదిలో ఒక లోన్ మాత్రమే తీసుకోవచ్చు. మొదటి లోన్ తీర్చేంతవరకు మరో లోన్ ఇవ్వరు. నిల్వ‌పై 25 శాతం మాత్రమే లోన్ రూపంలో వస్తుంది. 36 నెలలలోపు లోన్ తీర్చేస్తే వడ్డీ రేటు కేవలం 1 శాతంగా మాత్రమే ఉంటుంది. గడువు దాటితో 6 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

నగదు ఉసంహరించుకోవచ్చా?

ఖాతా తెరిచిన సంవత్సరం కాకుండా తదపరి ఐదేళ్లలో ఒకసారి నగదు ఉపసంహరించుకోవచ్చు. ఉదాహరణకు 2020-21లో ఖాతా తెరిస్తే 2026-27 లో నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే ఖాతా నిల్వ మొత్తంలో 50 శాతం మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. 

మెచ్యూరిటీ ఎప్పుడు?

ఖాతా తెరిచిన సంవత్సరం కాకుండా తదుపరి 15 సంవత్సరాల అనంతరం ఖాతా మెచ్యూరిటీ అవుతుంది. అకౌంట్ క్లోజర్ ఫామ్‌ను సంబంధిత పోస్టాఫీస్ బ్రాంచ్‌లో గానీ, బ్యాంక్‌లో గానీ సమర్పించాలి. అలాగే ఖాతా పుస్తకం కూడా ఇవ్వాలి. మెచ్యూరిటీ మొత్తాన్ని తదుపరి డిపాజిట్ చేయకుండా అలాగే ఖాతాలో కొనసాగించవచ్చు. పీపీఎఫ్ వడ్డీ రేటు చెల్లిస్తారు. లేదా మరో ఐదేళ్ల పాటు పీపీఎఫ్ ఖాతాను పొడిగించుకోవచ్చు. ఇందుకు ఎక్స్‌టెన్షన్ ఫామ్ సమర్పించాలి. అయితే నిలిచిపోయిన ఖాతాను మాత్రం మరో ఐదేళ్ల వ్యవధి కోసం పొడిగించలేరు.  ఖాతా పొడిగించిన సందర్భాల్లో ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి 60 శాాతానికి మించకుండా నగదు ఉపసంహరించుకోవచ్చు. 

మెచ్యూరిటీ కంటే ముందే క్లోజ్ చేయొచ్చా?

ఖాతాదారుకు గానీ, తనపై ఆధారపడిన భార్యాపిల్లలకు గానీ తీవ్రమైన అనారోగ్యం సంభవించినప్పుడు లేదా ఖాతాదారుకు గానీ, వారి పిల్లలకు గానీ ఉన్నత విద్య అవసరాలు ఉన్నప్పుడు ఖాతా క్లోజ్ చేయవచ్చు. గడువు కంటే ముందే క్లోజ్ చేసినప్పుడు 1 శాతం వడ్డీ కోత విధిస్తారు. ఖాతాదారు మరణిస్తే ఖాతా రద్దు చేసుకోవచ్చు. లేదా నామినీలు కొనసాగించవ్చు.