Kgf-2 | బాలీవుడ్‌లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన కేజీఎఫ్ 2...పదకొండు రోజుల్లోనే ఈ ఘనత సొంతం
25 April 2022, 10:14 IST
యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్-2 చిత్రం దేశవ్యాప్తంగా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. హిందీలో ఈ సినిమా మూడు వందల కోట్ల వసూళ్లను సాధించింది. తక్కువ టైమ్‌లో ఈ రికార్డును సొంతం చేసుకున్న పదో సినిమాగా నిలిచింది.
యశ్
దేశవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లతో కేజీఎఫ్ -2 చిత్రం దూసుకుపోతున్నది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం పదకొండు రోజుల్లోనే ఈ చిత్రం 300 కోట్ల వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. హిందీ చిత్రసీమలో మూడు వందల కోట్ల క్లబ్‌ను అత్యంత వేగంగా చేరుకున్న పదో సినిమాగా కేజీఎఫ్-2 నిలిచింది. 2019లో విడుదలైన వార్ సినిమా తర్వాత హిందీలో మూడు వందల కోట్ల వసూళ్లను సాధించిన సినిమా కేజీఎఫ్ 2 మాత్రమే కావడం గమనార్హం.
కొవిడ్ తో పాటు కథలోని లోపాల కారణంగా సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్ లాంటి స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. వారికి ఎవరికి సాధ్యం కానీ రికార్డును కేజీఎఫ్-2తో యశ్, ప్రశాంత్ నీల్ సాధించి చూపించారు. బాలీవుడ్‌లో బాహుబలి-2 మాత్రమే ఐదు వందల కోట్ల వసూళ్లను సాధించింది. ఆ సినిమా రికార్డులను కేజీఎఫ్-2 దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సక్సెస్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ లతో కలిసి హీరో యశ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందించారు. యశ్‌పై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్, అతడి క్యారెక్టరైజేషన్, హీరోయిజం, డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కేజీఎఫ్ సిరీస్‌లో మూడో భాగం రాబోతున్నది. ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో కేజీఎఫ్-3ని తెరకెక్కించబోతున్నారు.