Bichagadu 2 Movie update: బిచ్చగాడు మళ్లీ వస్తున్నాడు.. విడుదలకు ముహూర్తం ఫిక్స్
21 December 2022, 7:44 IST
- Bichagadu 2 Movie update: విజయ్ ఆంటోనీ సూపర్ హిట్ చిత్రం బిచ్చగాడుకు సీక్వెల్ రాబోతుంది. బిచ్చగాడు 2గా రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్రబృందం నిర్ణయించింది. ఇందులో విజయ్ నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు.
బిచ్చగాడు విడుదలకు ముహూర్తం ఫిక్స్
Bichagadu 2 Movie update: ఆరేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమా గుర్తుందా? విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. 2016లో వేసవి కానుకగా విడుదలైన ఈ అనువాదచిత్రం తమిళంలో కంటే కూడా తెలుగులోనే సూపర్ సక్సెస్ అయింది. అదే ఏడాది నోట్ల రద్దు జరగడం.. ఈ సినిమాలో ఓ బిచ్చగాడు.. 500, 1000 నోట్లను రద్దు చేయమని సూచించడం అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. నోట్ల రద్దును బిచ్చగాడు ముందుగానే అంచనా వేశాడంటూ మీమ్స్ హల్చల్ చేశాయి. తల్లి ఆరోగ్యం కోసం కొడుకు బిచ్చగాడు మాదిరిగా దీక్ష చేపట్టే ఈ కథ ప్రేక్షకులకు హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రావాలని కోరుకున్నారు. ఇప్పటికే ఆ సినిమాను మొదలుపెట్టేశారు కూడా. తాజాగా బిచ్చగాడు-2 గురించి ఆసక్తికర అప్డేట్ చెప్పారు హీరో విజయ్ ఆంటోనీ.
బిచ్చగడాడు-2 చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేయనున్నట్లు విజయ్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో విజయ్ ఆంటోనీ కళ్లకు ఎరుపు రంగు గుడ్డ కట్టుకుని ఉంటాడు. దానిపై యాంటీ బికిలీ(Anti Bikili) అని రాసి ఉంటుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు విజయ్. అంతేకాకుండా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా స్టార్ నెట్వర్క్ సొంతం చేసుకున్నట్లు తెలియజేశారు.
మాతృక తమిళంలో ఈ సినిమాను పిచ్చైక్కరన్ 2 పేరుతో.. తెలుగులో బిచ్చగాడు పేరుతో రానుంది. కన్నడలో భిక్షుకా-2, మలయాళంలో భిక్షాక్కరన్-2 పేరుతో విడుదల కానుంది. బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు గతేడాదే ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకుని వేసవికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
బిచ్చగాడు 2 సీక్వెల్‌ను తొలుత భారం, మెట్రో లాంటి సూపర్ హిట్లు అందించిన ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. అనంతరం ఆయన కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై అతడే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.