rana naidu |రానా నాయుడు వెబ్ సిరీస్ కు ప్యాకప్ చెప్పిన బాబాయ్, అబ్బాయ్
30 May 2022, 13:57 IST
- వెంకటేష్, రానా కలయికలో రానా నాయుడు పేరుతో ఓ వెబ్‌సిరీస్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాబాయ్, అబ్బాయ్ వెండితెరపై కలిసి నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ సిరీస్ దగ్గుబాటి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హాలీవుడ్ సిరీస్ రే డోనోవన్ ఆధారంగా రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్ చిత్రీకరణ పూర్తయినట్లు స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.
వెంకటేష్
మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో వెండితెరపై ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు వెంకటేష్. ఫ్యామిలీ ఆడియెన్స్ పాటు యువతరాన్ని అలరించారు. తొలిసారి ఆయన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇస్తూ రానానాయుడు పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేయబోతున్నారు. హాలీవుడ్ సిరీస్ రే డొనోవన్ ఆధారంగా రూపొందుతోంది. ఇందులో వెంకటేష్‌తో పాటు రానా కీలక పాత్రలను పోషిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు స్ట్రీమింగ్ కాబోతున్నది.
తాజాగా ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. క్లాప్ బోర్డ్స్ పట్టుకున్న వెంకటేష్,రానా ఫొటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నది. ఇందులో బాలీవుడ్ సెలిబ్రిటీలకు వచ్చే సమస్యలను పరిష్కరించే రానా నాయుడు అనే వ్యక్తిగా వెంకటేష్ కనిపించబోతున్నట్లు సమాచారం.సాల్ట్ పెప్పర్ లుక్‌లో అతడి క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండబోతున్నట్లు చెబుతున్నారు.
ఈ సిరీస్ లోనే బాబాయ్ వెంకటేష్,అబ్బాయ్ రానా తొలిసారి కలిసి నటిస్తున్నారు. గతంలో రానా హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో ఓ పాటలో వెంకటేష్ అతిథిగా కనిపించారు. పూర్తిస్థాయి పాత్రల్లో వీరిద్దరు కలిసి నటిస్తుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ వెబ్ సిరీస్ దగ్గుబాటి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు షో రన్నర్ గా కరణ్ అన్షుమాన్ వ్యవహరిస్తున్నారు. సూపర్న్ వర్మతో కలిసి కరణ్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ను వెల్లడించబోతున్నారు.
టాపిక్