Sankranti Movies Release Dates:నాలుగు రోజులు - ఐదు సినిమాలు - సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే
05 January 2023, 11:04 IST
Sankranti Movies Release Dates: టాలీవుడ్‌లో సంక్రాంతి రిలీజ్‌లకు సంబంధించిన రిలీజ్ డేట్స్ ఫైనల్ చేశారు. ఏ సినిమా ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే...
చిరంజీవి వాల్తేర్ వీరయ్య
Sankranti Movies Release Dates: సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. డబ్బింగ్ సినిమాలు రెండు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. చిరంజీవి వాల్తేర్ వీరయ్య కంటే బాలకృష్ణ వీరసింహారెడ్డి ఒక రోజు ముందుగా రిలీజ్ కాబోతున్నది. వీటి తర్వాత చిన్న సినిమా కళ్యాణం కమనీయం థియేటర్లలోకి రానుంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే...
విజయ్ వారసుడు- జనవరి 11
విజయ్ (Vijay) వారసుడు రిలీజ్ డేట్‌ను గురువారం రివీల్ చేశారు. జనవరి 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. వారసుడు రిలీజ్ డేట్ కోసం విజయ్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్‌కు గురువారం చిత్ర నిర్మాతలు గుడ్‌న్యూస్ వినిపించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్‌రాజు వారసుడు సినిమాను నిర్మిస్తోన్నారు. వారిసు పేరుతో స్ట్రెయిట్‌గా తమిళంలో ఈ సినిమాను రూపొందించారు. తెలుగులో వారసుడు పేరుతో అనువదిస్తున్నారు.
అజిత్ తెగింపు - జనవరి 11
విజయ్ వారసుడుకు పోటీగా తెగింపు సినిమాతో జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కోలీవుడ్ అగ్ర హీరో అజిత్. బ్యాంక్ రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో తినువు పేరుతో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాను తెలుగులో తెగింపు టైటిల్‌తో డబ్ చేస్తున్నారు. తెగింపు సినిమాకు బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరించారు.
బాలకృష్ణ వీరసింహారెడ్డి (Balakrishna Veera Simha Reddy) - జనవరి 12
బాలకృష్ణ వీరసింహారెడ్డి జనవరి 12న థియేటర్లలోకి రాబోతున్నది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. అఖండ విజయం తర్వాత బాలకృష్ణ నటించిన సినిమా ఇది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యతనిస్తూ వీరసింహారెడ్డి సినిమాను రూపొందించినట్లు తెలిసింది. ఇందులో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. వీరసింహారెడ్డి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
చిరంజీవి వాల్తేర్ వీరయ్య(Chiranjeevi Waltair Veerayya) - జనవరి 13
కొంత గ్యాప్ తర్వాత ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ కథాంశంతో చిరంజీవి చేస్తోన్న సినిమా వాల్తేర్ వీరయ్య. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా జనవరి 13న విడుదలకానుంది. ఇందులో రవితేజ మరో హీరోగా నటిస్తోన్నాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతుండటం ఆసక్తికరంగా మారింది.
కళ్యాణం కమనీయం - జనవరి 14
టాలీవుడ్‌లో సంక్రాంతి బరిలో నిలిచిన ఏకైక చిన్న సినిమా కళ్యాణం కమనీయం. సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఈసినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. అనిల్ కుమార్ అల్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. భిన్న మనస్తత్వాలు కలిగిన జంట కథతో కళ్యాణం కమనీయం సినిమా రూపొందింది.