Tollywood |టాలీవుడ్‌లో పీరియాడికల్ ట్రెండ్-కాలంలో వెనక్కి వెళుతున్న స్టార్స్
23 April 2022, 9:42 IST
భవిష్యత్తు మీద ఆశ, భరోసాతో పాటు గతించిన చరిత్రను తెలుసుకోవాలనే కోరిక, ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తాయి. అయితే చరిత్రలో తెలిసిందే కాకుండా తెలియని అంశాలు ఎన్నో ఉంటాయి. చరిత్ర పొరల్లో కప్పివేయబడిన వాస్తవాలతో పాటు మరుగున పడిన పోరాట యోధుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కరించే ట్రెండ్ టాలీవుడ్‌లో ఎక్కువైంది. కాలం ప్రవాహంలో వెనక్కి వెళుతూ చరిత్రలో ఏం జరిగిందో శోధించి ఫిక్షనల్ అంశాలతో సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఆనాటి కాలంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళుతున్నారు. నటన పరంగా వైవిధ్యతను కనబరచడంతో పాటు హీరోయిజాన్ని ప్రదర్శించేందుకు ఆస్కారం ఉండటంతో ఈ పీరియాడికల్ కథల్లో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ విజయాల తర్వాత పీరియాడికల్ సినిమాల ట్రెండ్ మరింత పెరిగింది. ప్రస్తుతం పీరియాడికల్ కథాంశాలతో తెలుగులో పలువురు అగ్ర హీరోలు సినిమాలు చేస్తున్నారు.
హరిహరవీరమల్లు
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో టాప్ త్రీ ప్లేస్ లో నిలిచింది. 1920 బ్రిటీష్ ఇండియా కాలం నాటి కథతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు. బ్రిటీషర్ల పాలనను ఎదురించి పోరాడిన యోధులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేజీఎఫ్-2 కూడా పీరియాడికల్ ఇతివృత్తంతోనే తెరకెక్కింది. 1970 బ్యాక్ డ్రాప్ లో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను వెండితెరపై ఆవిష్కృతం చేశారు. 1970 కాలం నాటి మనుషుల వేషభాషలను, కోలార్ గోల్డ్ ఫీల్డ్ పరిస్థితులను రియలిస్టిక్ గా సినిమాలో చూపించారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా 1990 టైమ్ పీరియడ్‌ను ఆవిష్కరిస్తూ రూపొందింది. కూలీగా మొదలుపెట్టి సిండికేట్ నాయకుడిగా ఎదిగిన పుష్ప రాజ్ అనే వ్యక్తి ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ సుకుమార్ ఈ సినిమాను రూపొందించారు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం 1975 కాలం నాటి కథతో తెరకెక్కింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టుతుండటంతో పీరియాడికల్ కథాంశాలపై దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు.
పవన్ కెరీర్ లో తొలి సినిమా...
హరిహరవీరమల్లు సినిమాతో కెరీర్ లో తొలిసారి పీరియాడికల్ బాట పట్టారు పవన్ కళ్యాణ్. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్‌లో మొఘలుల కాలం నాటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం మొఘలుల కాలం నాటి వాతావరణాన్ని సెట్స్ రూపంలో హైదరాబాద్ లో పునఃసృష్టించినట్లు తెలిసింది. తోటతరణి ఆధ్వర్యంలో అలనాటి కోటలు, రాజభవనాలను పోలిన సెట్స్ వేసినట్లు తెలిసింది. బందిపోటుగా పవన్ కళ్యాణ్ లుక్ డిఫరెంట్‌గా ఉండనున్నది.
కళ్యాణ్ రామ్ పీరియాడికల్ రూట్
రెండు పీరియాడికల్ చిత్రాలతో కళ్యాణ్ రామ్ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న బింబిసార చిత్రం చిత్రం ఆగస్ట్ 5న రిలీజ్ కానుంది. పీరియాడికల్ ఫాంటసీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో త్రిగర్తల దేశానికి చెందిన బింబిసారుడనే రాజుగా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. క్రీస్తూ పూర్వం నాటి కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను చేయబోతున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ సినిమా కూడా పీరియాడికల్ స్టోరీతోనే తెరకెక్కుతోంది. 1945 కాలంలో బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు.
1970 టైగర్ నాగేశ్వరరావు
రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు 1970 బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోంది. 1970 దశకంలో తెలుగునాట పేరమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అలనాటి స్టువర్ట్‌పురం సెట్‌ను హైదరాబాద్‌లో దాదాపు ఏడు కోట్ల వ్యయంతో వేశారు. ఇందులో 70 కాలం నాటి గజదొంగగా రవితేజ పాత్ర కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
1990ల నాటి కథ
1980-90 దశకం నాటి నక్సలైట్ ఉద్యమం, సామాజిక జీవన పరిస్థితులను ఆవిష్కరిస్తూ రానా విరాటపర్వం సినిమా రూపొందుతోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌కానుంది. సాయిపల్లవి ఈ సినిమాలో కథానాయికగా నటించింది.
టాపిక్