TOLLYWOOD | రేవ్ పార్టీలో నిహారికతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు? విచారణ జరుపుతున్న పోలీసులు
03 April 2022, 13:16 IST
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. శనివారం బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పబ్ పై పోలీసులు జరిపిన ఆకస్మిక దాడిలో డ్రగ్స్ బయటపడ్డాయి.ఈ దాడుల్లో పలువురు సినీ ప్రముఖులను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
రాహుల్ సింప్లిగంజ్
బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు జరిపిన దాడిలో డ్రగ్స్ బయటపడటం కలకలాన్ని సృష్టిస్తోంది. హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో కొకైన్, గంజాయితో పాటు మరికొన్ని డ్రగ్స్ బయటపడినట్లు తెలిసింది. ఈ దాడుల్లో పబ్ యజమాని సహా 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఇందులో 99 మంది యువకులు, 39 మంది యువతులు సహా 19 మంది పబ్ సిబ్బంది ఉన్నారు. వారి నుంచి ప్రాథమిక వివరాలు తీసుకొని పోలీసులు వదిలివేశారు.
డ్రగ్స్ తీసుకున్నారా?
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బిగ్ బాస్ విన్నర్, గాయకుడు రాహుల్ సింప్లిగంజ్ తో పాటు నాగబాబు కుమార్తె నిహారిక ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది తెలియలేదు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు, మాజీ డీజీపీ కూతురు ఈ దాడుల్లో పట్టుబడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. వారి విచారణలో ఏం తేలనుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రేవ్ పార్టీ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిహారిక పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తోన్న చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
గల్లా అశోక్ కు సంబంధం లేదు-గల్లా జయదేవ్ కుటుంబం విజ్ఞప్తి
ఈ రేవ్ పార్టీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, హీరో గల్లా అశోక్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. వాటిపై గల్లా అశోక్ కుటుంబం స్పందించింది. ఈ ఘటనతో అశోక్ కు ఎలాంటి సంబంధం లేదని, నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. హీరో సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు అశోక్.