Tatineni | టాలీవుడ్‌లో మరో విషాదం.. దర్శక దిగ్గజం తాతినేని రామారావు మృతి
20 April 2022, 8:14 IST
- ఎన్టీఆర్‌తో యమగోల లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు తాతినేని రామారావు కన్ను మూశారు. ఆయన మృతి పట్ల చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనే అనేకి సినిమాలను ఆయన తెరకెక్కించారు.
తాతినేని రామారావు
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. మంగళవారం నాడు నిర్మాత నారాయణ్‌దాస్ కన్నుమూయగా.. తాజాగా ప్రముఖ దర్శక దిగ్గజం తాతినేని రామారావు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం నాడు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్రసీమ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌తో 'యమగోల' లాంటి అనేక సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన తాతినేని రామారావు 1966 నుంచి 2000 వరకు చిత్రసీమలో ఉన్నారు. తెలుగు, హిందీ భాషల్లో కలిపి 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.
తాతినేని రామారావు.. కృష్ణా జిల్లాలోని కపిలేశ్వరంలో 1938లో జన్మించారు. తన సినీ ప్రస్థానాన్ని 1950వ దశకంలో తన కజిన్ అయిన తాతినేని ప్రకాశరావు, కోటయ్య వద్ద అసిస్టెంట్‌గా పనిచేయడంతో ప్రారంభించారు. తెలుగులో 1966లో వచ్చిన నవరాత్రి చిత్రానికి దర్శకత్వం వహించి దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇందులో శివాజీ గణేశన్, సావిత్రి నటించగా.. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి చేశారు. ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించడంతో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.
ఏఎన్నార్, జయలలితతో కలిసి బ్రహ్మచారితో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అక్కడ నుంచి విరామం లేకుండా మంచి మిత్రులు, రైతు కుటుంబం, జీవన తరంగాలు ఇలా వరుసగా 12 సినిమాలు చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి యమగోల చిత్రాన్ని తెరకెక్కించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. 1978 వరకు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఆయన 1979 నుంచి బాలీవుడ్ బాట పట్టారు. యమగోల రీమేక్‌గా లోక్ పర్‌లోక్ చిత్రాన్ని తెరకెక్కించి అక్కడా సక్సెస్ అందుకున్నారు. ఆ చిత్రం ఇచ్చిన ఊపుతో 1980వ దశకం నుంచి హిందీలో బిజీ అయిపోయారు.
అయినప్పటికీ తెలుగులోనూ మధ్యమధ్యలో చిత్రాలు చేశారు. అనురాగ దేవత(1982), పచ్చని కాపురం(1985), న్యాయానికి శిక్ష(1988), అగ్ని కెరటాలు(1988), తల్లిదండ్రులు(1991), గోల్‌మాల్ గోవిందం(1992) లాంటి సినిమాలు చేశారు. తెలుగులో కంటే బాలీవుడ్‌లోనే అధికంగా సినిమాలు చేశారు. ఎక్కువగా రీమేక్ చిత్రాలను తెరకెక్కించారు.
టాపిక్