Dubbing Movies: తెలుగు ప్రేక్షకులను అగౌరవపరుస్తున్నారు - వేట్టయన్‌పై బొమ్మరిల్లు రైటర్ ట్వీట్ వైరల్
06 October 2024, 10:28 IST
Dubbing Movies: డబ్బింగ్ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టడం మానేశారని డైలాగ్ రైటర్ అబ్బూరి రవి అన్నాడు. తెలుగు ప్రేక్షకులను తేలిగ్గా తీసుకుంటూ వారిని అగౌరవపరుస్తున్నారని అబ్బూరి రవి ట్వీట్ చేశాడు. వేట్టయన్ రిలీజ్ నేపథ్యంలో అబ్బూరి రవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
డబ్బింగ్ మూవీస్
Dubbing Movies: డబ్బింగ్ సినిమాలపై టాలీవుడ్ స్క్రీన్‌ప్లే రైటర్ అబ్బూరి రవి ఫైర్ అయ్యాడు. డబ్బింగ్ సినిమాలకు తెలుగు పేర్లు కూడా పెట్టకుండా పరభాషా టైటిల్స్‌తో రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అగౌరవపరుస్తున్నారని అబ్బూరి రవి ట్వీట్ చేశాడు.
అది కూడా మానేశారు...
“డబ్బింగ్ సినిమాలకి తెలుగు పేర్లు పెట్టేవారు. సినిమాలో... ఇతర భాషలలో ఉండే బోర్డు లని తెలుగులోకి మార్చేవారు. ఇప్పుడు అది కూడా మానేసి విడుదల చేస్తున్నారు” తన ట్వీట్‌లో అబ్బూరి రవి పేర్కొన్నాడు.
గొప్పతనం అనుకోను...
“వారి వారి భాష లలో వారి గొప్పదనాన్ని, కళాత్మకతని గౌరవిస్తాను. కానీ, తెలుగు ప్రేక్షకులని ఇంత తేలికగా తీసుకోవడం నచ్చట్లేదు. తెలుగుని గౌరవించని వాళ్ళని కూడా తెలుగువాళ్లు గౌరవించడం, ఆదరించడం, ఆ చిత్రాలని చూడ్డానికి మన డబ్బులు ఖర్చుపెట్టడం మన గొప్పతనం అని మాత్రం నేను అనుకోవట్లేదు” అంటూ అబ్బూరి రవి అన్నాడు. అబ్బూరి రవి ట్వీట్ వైరల్ అవుతోంది.
తమిళం, మలయాళం సినిమాల్ని చూడటం మానేయాలి...
అబ్బూరి రవి మాటలు నిజమేనంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. తమిళం, మలయాళ సినిమాలు చూస్తున్నాం కదా అని ఏ పేర్లు పడితే ఆ పేర్లు పెడుతున్నారని, ఎలా ఉన్నా చూస్తారు లే అన్న ధోరణి డబ్బింగ్ సినిమాల నిర్మాతల్లో కనిపిస్తుందని ఓ నెటిజన్ అన్నాడు. తమిళం, మలయాళం సినిమాలను తెలుగు ప్రేక్షకులు హిట్ చేస్తున్నారని, కానీ మన సినిమాలను అక్కడి ప్రేక్షకులు పట్టించుకోవడం లేదని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
వేట్టయన్ గురించేనా...
దసరా కానుకగా రజనీకాంత్ వేట్టయన్ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. ఈ తమిళ మూవీని అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వేట్టయన్ మూవీని ఉద్దేశించే అబ్బూరి రవి ఈ ట్వీట్ చేసినట్లు నెటిజన్లు చెబుతోన్నారు. వెట్టైయాన్ మూవీలో రజనీకాంత్‌తో పాటు అమితాబ్‌బచ్చన్, ఫహాద్ ఫాజిల్, దగ్గుబాటి రానా కీలక పాత్రల్లో నటించారు. వేట్టయాన్‌తో పాటు సూర్యకంగువ కూడా సేమ్ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ కాబోతోంది.
డైలాగ్ రైటర్‌గా...
తెలుగులో కిక్, క్షణం, ఎక్కడిపోతావు చిన్నవాడా, గూఢచారి, నాందితో పాలు పలు సూపర్ హిట్ సినిమాలకు డైలాగ్స్ అందించారు అబ్బూరి రవి. కొన్ని సినిమాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేశాడు. డైలాగ్ రైటర్‌గా బొమ్మరిల్లు మూవీతో నంది అవార్డును అందుకున్నాడు. ప్రస్తుతం అడివిశేష్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న డెకాయిట్ మూవీకి డైలాగ్స్, స్క్రీన్‌ప్లేను సమకూర్చుతున్నాడు.