Tiger Nageswara Rao: కీలక నిర్ణయం తీసుకున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మేకర్స్.. ఇదేదో ముందే చేయాల్సిందంటున్న ఫ్యాన్స్
21 October 2023, 20:15 IST
- Tiger Nageswara Rao Run time: టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న అభిప్రాయాల నేపథ్యంలో చర్యలకు దిగారు.
Tiger Nageswara Rao: కీలక నిర్ణయం తీసుకున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మేకర్స్
Tiger Nageswara Rao Run time: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా శుక్రవారం (అక్టోబర్ 20) థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1970, 80 దశకాల్లో దేశంలోనే పేరుగాంచిన గజదొంగ స్టువర్టుపురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్‌తో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే, రిలీజ్ అయ్యాక ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా సుదీర్ఘ రన్ టైన్ (నిడివి) విషయంలో విమర్శలు వచ్చాయి. దీనిపై దిద్దుబాటు చర్యలకు మేకర్స్ నిర్ణయించారు. ఆ వివరాలివే..
టైగర్ నాగేశ్వరరావు సినిమా రన్‍టైమ్‍ను సుమారు అరగంట పాటు తగ్గించేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఈ విషయాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నేడు (అక్టోబర్ 21) అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం రన్‍టైమ్‍ను 2 గంటల 37 నిమిషాలకు తగ్గిస్తున్నట్టు ట్వీట్ చేసింది. “2 గంటల 37 నిమిషాల సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో భారత అతిపెద్ద గజదొంగ కథను చూడండి. దసరా విన్నర్‌ను థియేటర్లలో ఎంజాయ్ చేయండి” అని వెల్లడించింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా సుమారు 3 గంటల (2 గంటల 52 నిమిషాలు) నిడివితో వచ్చింది. ఇప్పుడు రన్‍టైమ్‍ను మూవీ యూనిట్ ట్రిమ్ చేసింది.
టైగర్ నాగేశ్వరరావు సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయేలా ఉన్నా.. రెండో అర్ధ భాగంలో నిడివి ఎక్కువ కావడం వల్ల బోరు కొడుతోందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్క్రీన్‍ప్లే ప్రయోగం కూడా ఫలించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగి రన్‍టైమ్‍కు కోత విధించింది మూవీ యూనిట్.
అయితే, ఇదేదో ముందే చేసి ఉంటే నెగెటివ్ టాక్ వచ్చేది కాదు కదా అని టైగర్ నాగేశ్వరరావు మూవీ యూనిట్‍పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్. ఇప్పటికైనా మేల్కొని మంచి పని చేశారని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రిలీజ్‍కు ముందే రన్‍టైమ్‍పై సందేహాలు తలెత్తాయని, అప్పుడు చూసుకోవాల్సిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. లేట్‍గా అయినా రన్ టైమ్ తగ్గించి మంచి నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు.
టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి యంగ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నుపుర్ సనన్ హీరోయిన్‍గా నటించగా.. అనుపమ్ ఖేర్, గాయత్రీ భరద్వాజ్, రేణు దేశాయ్, జుస్సు సెంగుప్త కీలక పాత్రలు చేశారు.