Ravi Teja: విక్రమ్ రాథోడ్ తర్వాత ఇదే.. అలాంటి వారితో ఎన్ని సినిమాలైనా చేస్తా: రవితేజ
22 October 2023, 17:31 IST
- Ravi Teja - Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు సినిమా సక్సెస్ మీట్‍లో హీరో రవితేజ మాట్లాడారు. ఈ సినిమాకు వస్తున్న స్పందన పట్ల సంతోషంగా ఉందని అన్నారు. అలాగే, మరిన్ని కామెంట్స్ చేశారు.
Ravi Teja: విక్రమ్ రాథోడ్ తర్వాత ఇదే.. అలాంటి వారితో ఎన్ని సినిమాలైనా చేస్తా: రవితేజ
Ravi Teja - Tiger Nageswara Rao: భారీ అంచనాల మధ్య టైగర్ నాగేశ్వరరావు సినిమా శుక్రవారం (అక్టోబర్ 20) థియేటర్లలో రిలీజ్ అయింది. మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాలో హీరోగా నటించారు. స్టువర్టుపురం గజదొంజ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. టైగర్ నాగేశ్వరరావు పాత్ర పోషించారు రవితేజ. ఆయన నటనకు ప్రశంసలు వస్తున్నాయి. కాగా, ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్‍ను చిత్ర యూనిట్ నేడు (అక్టోబర్ 23) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడారు.
విక్రమారుడు సినిమాలో విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ తర్వాత తనకు విపరీతమైన ఆత్మసంతృప్తిని ఇచ్చిన క్యారెక్టర్ టైగర్ నాగేశ్వరరావు అని రవితేజ అన్నారు. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వంశీని ప్రశంసించారు. “నేను చాలా చాలా హ్యాపీ. నేను ఇంతకు ముందు చెప్పినట్టు.. ఒక విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ తర్వాత నాకు విపరీతమైన సంతృప్తిని ఇచ్చిన క్యారెక్టర్ ఈ టైగర్ నాగేశ్వరరావు” అని రవితేజ చెప్పారు. తాను ఊహించిన దాని కంటే వంశీ ఈ సినిమాను బాగా తీశారని అన్నారు.
క్లియర్‌గా, నమ్మకంతో ఉన్న వారితో తాను ఎన్నిసార్లయినా సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉంటానని రవితేజ అన్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల తాను సంతోషంగా ఉన్నానని చెప్పారు. అభిమానులే ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తున్నారని రవితేజ అన్నారు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా రన్‍టైమ్‍పై చాలా మంది ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో రన్‍టైమ్ అరగంటకు పైగా కట్ చేసింది మూవీ యూనిట్. 2 గంటల 37 నిమిషాలకు నిడివిని తగ్గించింది.
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్‍గా చేశారు. అనుపమ్ ఖేర్, గాయత్రీ భరద్వాజ్, రేణు దేశాయ్, జుస్సు సెంగుప్త, నాజర్, మురళీ శర్మ, సుదేవ్ నాయర్, హరీశ్ పేరడి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలు అభిషేక్ అగర్వాల్ నిర్మించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ అయింది. హిందీ ప్రమోషన్లను జోరుగా చేశారు రవితేజ. చాలా ఇంటర్వ్యూలు, ప్రెస్‍మీట్‍లు నిర్వహించారు. హిందీలోనూ ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది.