Kaun Banega Crorepati: కౌన్ బనేగా క్రోర్‌పతిలో ఇది రూ.7 కోట్ల ప్రశ్న.. దీనికి సమాధానం మీకు తెలుసేమో చూడండి
06 September 2023, 16:07 IST
- Kaun Banega Crorepati: కౌన్ బనేగా క్రోర్‌పతిలో ఇది రూ.7 కోట్ల ప్రశ్న. దీనికి సమాధానం చెప్పలేక కంటెస్టెంట్ గేమ్ మధ్యలోనే వదిలేశాడు. మరి ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసేమో చూడండి.
కౌన్ బనేగా క్రోర్‌పతిలో రూ.కోటి గెలిచిన జస్కరన్ సింగ్, అమితాబ్ బచ్చన్
Kaun Banega Crorepati: ప్రముఖ హిందీ ఛానెల్ సోనీలో ప్రసారమయ్యే క్విజ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి. అప్పుడెప్పుడో 2000లో ప్రారంభమైన ఈ షో ప్రస్తుతం 15వ సీజన్ నడుస్తోంది. ఈ మధ్యే ప్రారంభమైన ఈ షో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో 21 ఏళ్ల జస్కరన్ సింగ్ అనే యువకుడు ఈ గేమ్ అత్యధిక ప్రైజ్‌మనీ రూ.7 కోట్లు గెలవడానికి అతి దగ్గరగా వచ్చాడు.
కానీ చివరి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో రూ. కోటితో సరిపెట్టుకొని ఇంటిదారి పట్టాడు. కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో అతడు అంతగా సమాధానం చెప్పలేని ప్రశ్న ఏంటో తెలుసా? "పద్మ పురాణం ప్రకారం.. ఓ జింక శాపం వల్ల ఏ రాజు వందేళ్లపాటు పులిలా జీవించాల్సి వచ్చింది?" దీనికి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు.
అవేంటంటే.. ఎ. క్షేమంధుర్తి, బి. ధర్మదత్త, సి. మితద్వజ, డి. ప్రభంజన. ఈ నాలుగు ఆప్షన్లలో సరైన సమాధానం ఏదో జస్కరన్ సింగ్ తేల్చుకోలేకపోయాడు. తప్పుడు సమాధానం చెబితే.. ఒకేసారి అతని ప్రైజ్‌మనీ రూ.3.20 లక్షలకు పడిపోతుంది. దీంతో రిస్క్ ఎందుకు అనుకొని అతడు గేమ్ అక్కడితో వదిలేశాడు. దీంతో రూ.కోటి అతని సొంతమైంది.
ఈ ప్రశ్నకు సరైన సమాధానమేంటో మీకైనా తెలుసా? అది ఆప్షన్ డి. ప్రభంజన. ఈ సమాధానం చెప్పి ఉంటే జస్కరన్ సింగ్ కు రూ.7 కోట్లు దక్కేవి. అయితే అప్పటికే అతని దగ్గర లైఫ్‌లైన్లన్నీ అయిపోయాయి. రూ.కోటి ప్రశ్న దగ్గరే తన చివరి లైఫ్‌లైన్ ఉపయోగించుకున్నాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
ఈ క్లిప్ ను సోనీ ఛానెల్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. పంజాబ్ లోని తర్న్ తరణ్ జిల్లాలోని ఖలారా ఊరు నుంచి వచ్చిన జస్కరన్ సింగ్.. 15 ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికే రోజూ తన గ్రామం నుంచి నాలుగు గంటల పాటు ప్రయాణించిన జస్కరన్.. ఆ ఊరి నుంచి డిగ్రీ పూర్తి చేసిన అతికొద్ది మందిలో ఒకరు.
గత నాలుగేళ్లుగా తాను కౌన్ బనేగా క్రోర్‌పతిలో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా జస్కరన్ సింగ్ చెప్పాడు. మొత్తానికి 15వ సీజన్ లో షోలో అడుగుపెట్టిన అతడు హాట్ సీట్ వరకూ రావడమే కాకుండా ఏకంగా రూ.కోటి గెలుచుకోవడం విశేషం. ప్రస్తుతం అతడు యూపీఎస్సీ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాడు.