The Kashmir Files Unreported trailer: ది కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది
21 July 2023, 16:30 IST
- The Kashmir Files Unreported trailer: ది కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ పై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ది కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్ వెబ్ సిరీస్ ట్రైలర్
The Kashmir Files Unreported trailer: ది కశ్మీర్ ఫైల్స్ మూవీ గతేడాది ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. 1990లో కశ్మీరీ పండితుల ఊచకోతపై ఈ సినిమాను రూపొందించాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఇప్పుడదే డైరెక్టర్ ది కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్ వెబ్ సిరీస్ ను తీసుకొస్తున్నాడు.
శుక్రవారం (జులై 21) ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. కశ్మీర్ లో మూడు దశాబ్దాల కిందట జరిగిన ఆ ఊచకోతను ప్రత్యక్షంగా చూసిన వారు, చరిత్రకారులు, నిపుణుల అనుభవాలు, అభిప్రాయాలతో ఈ సిరీస్ రూపొందించారు. కశ్మీరీ పండితులపై జరిగిన అకృత్యాలను మరింత కళ్లకు కట్టినట్లు ఈ సిరీస్ చూపిస్తుందని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అంటున్నాడు.
రెండు నిమిషాల ఈ ట్రైలర్ లో ఆనాడు జరిగిన వాస్తవ ఘటనల వీడియో క్లిప్స్ తోపాటు బాధితుల అనుభవాలు కూడా చూడొచ్చు. గతేడాది వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా కంటే ఈ వెబ్ సిరీస్ కశ్మీరీ పండితుల ధైన్య స్థితిని మరింత వివరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. జీ5 (ZEE5) ఓటీటీలో ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ అవనుంది.
ఈ సిరీస్ పై వివేక్ స్పందించాడు. "కశ్మీర్ లో జరిగిన మారణహోమం ఇండియాకే కాదు మొత్తం మానవాళికే మాయని మచ్చ. ఆధునిక యుగంలో దాచి పెట్టిన అతిపెద్ద విషాదం ఇది. ఈ స్టోరీని నిజాయతీగా చెప్పడం అవసరం. ఇప్పటి వరకూ ఇండియాలో అన్ని సినిమాలు, సాహిత్యం, మీడియా సమకాలీన చరిత్ర చూపించింది.
మేము 32 ఏళ్ల తర్వాత ది కశ్మీర్ ఫైల్స్ సినిమా తీశాం. 4 ఏళ్లు రీసెర్చ్ చేసి ఈ మూవీ తీశాము. అది ప్రజలు కళ్లు తెరిపించింది. అయితే ఈ సినిమాను కొందరు దుష్ప్రచారం అని ఆరోపిస్తే మరికొందరు జరిగినదాంట్లో పది శాతమే చూపించారని అన్నారు" అని వివేక్ చెప్పాడు.
అందుకే దీనిపై మరింత అధ్యయనం చేసి, ఎంతో మంది ఇంటర్వ్యూలు తీసుకొని అసలు నిజం ఏంటో చూపించే ప్రయత్నం చేశామని వెల్లడించాడు. ది కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్ మీ మనసులను కలిచి వేస్తుందని కూడా చెప్పాడు.