Tegimpu Movie Review: తెగింపు మూవీ రివ్యూ - అజిత్ సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడా?
11 January 2023, 11:45 IST
Tegimpu Movie Review: అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తెగింపు. ఈ బుధవారం తెలుగుతో పాటు తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే...
అజిత్
Tegimpu Movie Review: కోలీవుడ్ హీరోల్లో అజిత్‌ది (Ajith) ఓ ప్రత్యేకమైన పంథా. మిగిలిన హీరోలకు భిన్నంగా ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తుంటాడు అజిత్. హీరోగా ఒకే తరహా కథలు, పాత్రలకు పరిమితం కావడానికి ఇష్టపడడు. మరోసారి ఈ సిద్ధాంతాన్ని నమ్ముతూ అజిత్ చేసిన తాజా చిత్రం తెగింపు. ఖాకీ ఫేమ్ హెచ్ వినోద్ (H Vinoth) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో రూపొందిన తెగింపు సినిమాలో మంజు వారియర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 11న (నేడు) తెలుగుతో పాటు తమిళంతో ఒకే రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో తినువు (Thunivu) పేరుతో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా? ఈ సినిమాతో అజిత్ రెండు భాషల్లో హిట్ అందుకున్నాడా లేదా అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
Tegimpu Movie Story :బ్యాంక్ హైజాక్
యువర్ బ్యాంక్ అధినేత క్రిష్ (జాన్ కొక్కెన్) వైజాగ్‌లోని తమ మెయిన్ బ్రాంచ్‌ను పోలీస్ ఆఫీసర్ రామచంద్ర(అజయ్), రాధ అనే క్రిమినల్ గ్యాంగ్ కలిసి హైజాక్ చేసి అందులో ఉన్న ఐదు వందల కోట్లను కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. అందుకోసం ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే రాధ గ్యాంగ్ బ్యాంకులోకి ఎంటర్ అవుతోంది. కానీ వారి కంటే ముందే ఆ బ్యాంక్‌లోకి ఎంటర్ అయిన ఇంటర్‌నేషనల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ డార్క్ డెవిల్ (అజిత్) ఆ బ్యాంక్‌ను హైజాక్ చేస్తాడు.
డార్క్ డెవిల్ అండ్ గ్యాంగ్ చేసిన పక్కా ప్లాన్ వలన పోలీసులు బ్యాంకు లోపలికి ఎంటర్ కాలేకపోతారు. బ్యాంకులో మాత్రం 1500 కోట్ల డబ్బు ఉందని అధికారులు చెబితే డార్క్ డెవిల్ మాత్రం అందులో అదనంగా మరో ఇరవై ఐదు కోట్లు ఉన్నాయని అంటాడు. నిజంగా ఆ బ్యాంకులో అంత డబ్బు ఉందా? ఆ డబ్బు ఎవరిది? డార్క్ డెవిల్ఆ బ్యాంక్‌ను ఎందుకు హైజాక్ చేయాలని అనుకున్నాడు? ప్రజలను మోసం చేసి అక్రమంగా డబ్బును కూడబెట్టిన క్రిష్ తో అతడి టీమ్ మోసాన్ని డార్క్ డెవిల్ ఎలా బయటపెట్టాడు. ఈ ప్లాన్‌లో డార్క్ డెవిల్‌కు సాయం చేసిన రమణి(మంజు వారియర్) ఎవరు అన్నదే(Tegimpu Movie Review) ఈ సినిమా కథ.
బ్యాంకు మోసాలతో...
బ్యాంకు మోసాలకు యాక్షన్‌ను జోడించి దర్శకుడు హెచ్ .వినోద్ తెగింపు ఈ కథను రాసుకున్నాడు. మ్యూచ్‌వల్ ఫండ్స్, ఇతర ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ పేరుతో ఫేక్ గ్యారెంటీలు ఇస్తూ కొన్ని బ్యాంకులు ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయి? దివాళా పేరుతో బ్యాంకులను మూసివేస్తూ సామాన్యుల కష్టార్జితాన్నిఏ విధంగా దోచుకుంటున్నారో ఈ సినిమాలో చర్చించారు.
అదే విధంగా అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డులను అంటగడుతూ వారి నుంచి పదింతల డబ్బును ఏ విధంగా బ్యాంకులు తిరిగి తీసుకుంటూ ఇబ్బందులు పెడుతున్నాయో చూపించారు. ప్రజలు దాచుకున్న డబ్బును ఛార్జీల పేరుతో బ్యాంకులు ఏ విధంగా దోచుకుంటున్నాయని తెగింపులో ఆవిష్కరించారు దర్శకుడు. బ్యాంకుల మోసాలకు రివేంజ్ డ్రామాను జోడిస్తూ పూర్తిగా యాక్షన్ అంశాలతో (Tegimpu Movie Review)ఈ సినిమాను తెరకెక్కించారు.
ఫన్ ప్లస్ థ్రిల్...
పోలీస్ ఆఫీసర్ రామచంద్ర బ్యాంకును దోచుకోవడానికి వేసిన ప్లాన్‌ను తిప్పికొడుతూ వారికే తెలియకుండా డార్క్ డెవిల్ బ్యాంక్‌ను హైజాక్ చేసే ఫస్ట్ సీన్‌తోనే ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని రేకెత్తించారు దర్శకుడు వినోద్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్‌తో పాటు మరోవైపు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించిన వారి వివరాల్ని డార్క్ డెవిల్ స్వయంగా పోలీసులకు అందించే సీన్స్‌తో కామెడీ, థ్రిల్‌ను చక్కగా బ్యాలెన్స్ చేశారు డైరెక్టర్.
డార్క్ డెవిల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో పాటు ఓ సామాన్యుడికి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడానికి అతడి టీమ్ ఎలాంటి సాహసానికి ఒడిగట్టారన్నది సెకండాఫ్‌లో పూర్తిగా యాక్షన్ అంశాలతో నడిపించారు.
ఒకే ప్లేస్‌లో జరిగే కథ...
తెగింపు కథ మొత్తం బ్యాంక్ చుట్టూ తిరుగుతుంది. ఒకే ప్లేస్‌లో కథను నడిపిస్తూ ప్రేక్షకుల్ని రెండున్నర గంటలు ఎంగేజ్‌చేయడం సులభం కాదు. కానీ ఆ విషయంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. బ్యాంకులో ఉంటూనే విలన్స్ వేసే ఎత్తులను అజిత్ తిప్పికొట్టే సీన్స్‌ను దర్శకుడు ఇంటెన్స్‌గా ఆవిష్కరించారు. డార్క్ డెవిల్ బ్యాంకును ఎందుకు హైజాక్ చేశాడన్నది చివరి వరకు ప్రేక్షకుల ఊహలకు అందకుండా నడిపించాడు. విలన్స్‌ను ఆ బ్యాంకులోకి రప్పించడం సీన్స్ లాజికల్‌గా ఉన్నాయి. యాక్షన్ అంశాలను డిజైన్ చేసిన తీరు బాగుంది. క్లైమాక్స్ యాక్షన్ సీన్ హాలీవుడ్ స్థాయిలో భారీగా తెరకెక్కించారు.
కామెడీ వర్కవుట్ కాలేదు...
యాక్షన్ అంశాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ మిగిలిన ఎమోషన్స్‌పై దృష్టిసారించలేదు. సీరియస్ ఇష్యూను కొన్ని చోట్ల సెటైరికల్‌గా చెప్పాలని అనుకున్నారు దర్శకుడు.కానీ అందులోని కామెడీ సరిగా పండలేదు.
అజిత్ వన్ మెన్ షో...
అజిత్ వన్ మెన్ షోగా తెగింపు సినిమా నిలుస్తుంది. అతడిని యాక్షన్ హీరోగా దర్శకుడు వినోద్ ఈ సినిమాలో ఆవిష్కరించారు. అజిత్ నుంచి అభిమానులు కోరుకునే హంగులన్నీ ఉండేలా క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. అజిత్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. కామెడీ,యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. రమణిగా మంజు వారియర్ యాక్షన్‌రోల్‌లో కనిపించింది. నిజాయితీకలిగిన పోలీస్ ఆఫీసర్‌గా సముద్రఖని నటన ఒకే అనిపిస్తుంది. అజయ్, జాన్ కొక్కెన్ విలనిజం ఎఫెక్టివ్‌గా లేదు. జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
Tegimpu Movie Review -అజిత్ ఫ్యాన్స్‌కు మాత్రమే...
తెగింపు అజిత్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన యాక్షన్ ఫిల్మ్. అతడి అభిమానులను అలరిస్తుంది. యాక్షన్ సినిమా లవర్స్‌ను కూడా కొంత వరకు మెప్పించే సినిమా ఇది.
రేటింగ్: 2.5 /5