Pathaan Song Controversy: మరో వివాదంలో పఠాన్ - బేషరామ్ పాట కాపీ అంటూ పాకిస్థాన్ సింగర్ కామెంట్స్
03 January 2023, 7:54 IST
Pathaan Song Controversy: షారుఖ్‌ఖాన్ పఠాన్ సినిమాలోని బేషరామ్ సాంగ్ కాపీ అంటూ పాకిస్థాన్ సింగర్ సాజిద్ అలీ ఆరోపించాడు. అతడి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
షారుఖ్‌ఖాన్, దీపికా పడుకోణ్
Pathaan Song Controversy: షారుఖ్‌ఖాన్ పఠాన్ సినిమాను ఒకదాని తర్వాత మరొకటి వరుసగా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ బేషరామ్తోనే ఈ వివాదాల తంతు మొదలైంది. ఇందులో దీపికా పడుకోణ్ ధరించిన డ్రెస్‌లపై రాజకీయ వర్గాలతో పాటు నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ పాటలో దీపికా పడుకోణ్ కాషాయ రంగు బికినీ ధరించి కనిపించడంపై మధ్యప్రదేశ్ మినిస్టర్ ప్రత్యక్షంగానే విమర్శలు గుప్పించారు. ఈ వివాదం ముగిసిపోకముందే బేషరామ్ సాంగ్ కాపీ అంటూ పాకిస్థాన్ సింగర్ సాజిద్ అలీ ఆరోపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల విడుదలైన కొత్త సినిమాలోని పాట వినగానే 26 ఏళ్ల క్రితం తాను కంపోజ్ చేసిన అబ్ కే హమ్ బిచారే పాట గుర్తొచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో సాజిద్ అలీ పేర్కొన్నాడు.
అబ్ కే హమ్ పాటను పాడి వినిపించాడు. అయితే సాజిద్ అలీ పఠాన్ సినిమా పేరును మాత్రం ఈ పోస్ట్‌లో పేర్కొన్నలేదు. అతడి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాజిద్ అలీ సాంగ్‌తో బేషరామ్ పాటను నెటిజన్లు కంపేర్ చేస్తున్నారు. ట్యూన్స్ ఒకేలా ఉండటంతో కాపీ కొట్టింది నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. బేషరామ్ పాట వింటుంటే సాజిద్ అలీ సాంగ్ తనకు గుర్తొస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇండియన్స్ తమ పాటలను ఎప్పుడూ పైరేట్ చేస్తుంటారని కనీసం పాకిస్థాన్ సింగర్స్‌కు క్రెడిట్ కూడా ఇవ్వరని మరో నెటిజన్ పేర్కొన్నాడు. కాపీ ట్యూన్ కామెంట్స్ బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. పఠాన్ సినిమా జనవరి 25న రిలీజ్ కానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్నాడు. జాన్ అబ్రహమ్ విలన్‌గా నటిస్తోన్నాడు. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో ఒకేరోజు ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.