Saranga Dariya Review: సారంగదరియా రివ్యూ - రాజా రవీంద్ర ఫ్యామిలీ డ్రామా మూవీ ఎలా ఉందంటే?
12 July 2024, 16:39 IST
Saranga Dariya Review: రాజా రవీంద్ర ముఖ్య పాత్రలో నటించిన సారంగదరియా మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి పద్మారావు అబ్బిశెట్టి (పండు) దర్శకత్వం వహించాడు.
సారంగదరియా మూవీ రివ్యూ
Saranga Dariya Review: రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన సారంగదరియా మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ తెలుగు మూవీకి పద్మారావు అబ్బిశెట్టి (పండు) దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శివకుమార్, యశస్విని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. సారంగదరియా సినిమా ఎలా ఉందంటే?
కృష్ణకుమార్ కుటుంబం కథ...
కృష్ణ కుమార్ (రాజా రవీంద్ర) లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. కాలేజీలో విద్యార్థులకు నీతి పాఠాలను భోదించే కృష్ణకుమార్ తన పిల్లలను మాత్రం సరైన దారిలో పెట్టలేకపోతాడు. పెద్ద కొడుకు అర్జున్ (మోయిన్) కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా తాగుడుకు బానిసగా మారి అందరితో గొడవలు పడుతుంటాడు. చిన్న కొడుకు సాయి (మోహిత్) ప్రేమ పేరుతో అమ్మాయిల చుట్టూ తిరుగుతూ జల్సాలు చేస్తుంటాడు.
మరోవైపు కూతురు అను (యశస్విని) అమ్మాయి కాదని ట్రాన్స్‌గర్ల్ అనే నిజం బయటపడటంతో కృష్ణ కుమార్ ఫ్యామిలీ అవమానాల పాలవుతుంది. కొడుకుతోపాటు కూతురు కారణంగా కృష్ణకుమార్‌కు మనశ్శాంతి కరువైపోతుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సివస్తుంది.
ఈ సమస్యల నుంచి బయటపడటానికి కృష్ణ కుమార్ ఏం చేశాడు? అందాల పోటీల్లో పాల్గొనాలనే అను కోరికకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? తన కలను అను ఎలా నెరవేర్చుకుంది? అర్జున్ లవ్‌లో ఫెయిలవ్వడానికి కారణం ఏమిటి? సాయి, ఫాతిమా (మధులత) ప్రేమకథకు కులమతాలు అవరోధంగా నిలిచాయా? అన్నదే సారంగదరియా (Saranga Dariya Review) మూవీ కథ.
ఒకప్పుడు సక్సెస్ ఫార్ములా...
ఓ మధ్య తరగతి తండ్రి, కుటుంబ సభ్యుల కారణంగా అతడు పడే కష్టాలు, అవమానాలతో ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలొచ్చాయి. దాసరి నారాయణరావు, ముత్యాల సుబ్బయ్యతో పాటు పలువురు సీనియర్ డైరెక్టర్లు ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ కథలతో సినిమాలను తెరకెక్కించి విజయాల్ని అందుకున్నారు. యూత్, మాస్ సినిమాల ట్రెండ్ పెరిగిపోవడంలో కొన్నాళ్లుగా ఈ ఫ్యామిలీ కథల జోరు తగ్గింది. చాలా రోజుల తర్వాత ఈ జోనర్‌లో వచ్చిన సినిమానే సారంగదరియా.
తొలి సినిమాతోనే...
మిడిల్ క్లాస్ కష్టాలను, కన్నీళ్లను తన తొలి సినిమా సారంగదరియాలోనే ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు పండు. ఆ సినిమా ద్వారా సొసైటీలోని కులమతాల వివక్షను, ఆడపిల్లల కలలకు సమాజం, కుటుంబం పరంగా ఉండే అడ్డంకులను ఎమోషనల్‌గా చూపించే ప్రయత్నం చేశారు.
ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్స్ సమస్యలను హృద్యంగా దర్శకుడు ఈ సినిమాలో ప్రజెంట్ చేశాడు. అమ్మాయిగా మారిన అబ్బాయిలకు సొసైటీ ఎలా చిన్నచూపు చూస్తుంది? ఈ నిజాన్ని దాచే క్రమంలో కుటుంబసభ్యులు పడే ఆవేదనను వాస్తవిక కోణంలో సారంగదరియాలో డైరెక్టర్ చర్చించాడు. ట్రాన్స్‌గర్ల్‌గా మారిన అబ్బాయిలకు కుటుంబమే మొదటగా అండగా నిలబడాలని, తమ లక్ష్యాల సాధన దిశగా వారిని ప్రోత్సహించాలని దర్శకుడు ఈ సినిమాలో సందేశాత్మకంగా చెప్పిన తీరు బాగుంది.
ఫస్ట్ హాఫ్ ఫన్ విత్ ఎమోషన్స్...
కృష్ణకుమార్ తో పాటు అతడి కుటుంబంలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ హాఫ్‌ను ఫన్ కామెడీతో డైరెక్టర్ నడిపించాడు. ఇంటర్వెల్‌లో ట్రాన్స్‌గర్ల్ అంటూ కూతురి పాత్రకు సంబంధించి వచ్చే ట్విస్ట్ తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
కుటుంబాన్ని సరైన దారిలో పెట్టడానికి కృష్ణ కుమార్ చేసే ప్రయత్నాలు, కొడుకు అర్జున్ మార్పు రావడం, ఫాతిమా ప్రేమ ను దక్కించుకోవడానికి సాయి తీసుకునే నిర్ణయం తో కథను ముందుకు నడిపించాడు డైరెక్టర్. వీటితో పాటు అందాల పోటీల్లో పాల్గొనడానికి అను చేసే జర్నీ చూపిస్తూ సినిమాను ఎండ్ చేశాడు. డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి.
నాచురాలిటీ మిస్...
సాయి, అర్జున్, ఎదుర్కొనే అడ్డంకులు, వారిలో వచ్చే మార్పుల్లో కొన్ని చోట్ల నాచురాలిటీ మిస్సయినట్లు అనిపిస్తుంది. అను పాత్రకు సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను కొత్తగా రాసుకున్నాడు దర్శకుడు. అర్జున్, సాయి లవ్ ట్రాక్ ల విషయంలో రొటీన్‌గా అడుగులు వేశారు. ప్రతి క్యారెక్టర్ తాలూకు సంఘర్షణను డీటైలింగ్‌గా చెప్పాలనే దర్శకుడి ఆలోచన వల్ల కొన్ని చోట్ల సినిమా నత్తనడకన సాగుతూ ల్యాగ్ అయినట్లుగా అనిపిస్తుంది.
మిడిల్ క్లాస్ ఫాదర్‌గా...
రాజా రవీంద్ర గతంలో నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్స్‌లోనే ఎక్కువగా కనిపించాడు. వాటికి భిన్నంగా సారంగదరియా మూవీలో మిడిల్ క్లాస్ ఫాదర్‌గా పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. ఆలోచలనకు, వాస్తవానికి మధ్య నిరంతరం సంఘర్షణ పడే పాత్రలో అతడి నటన బాగుంది. రాజా రవీంద్ర తర్వాత యాక్టింగ్ పరంగా ట్రాన్స్‌గర్ల్ పాత్రలో నటించిన యశస్విని ఎక్కువ మార్కులు పడతాయి. మెయిన్, మోహిత్ కూడా ఓకే అనిపించారు. అనంత్‌బాబు, హర్షవర్ధన్ కామెడీ మాత్రం అంతగా వర్కవుట్ కాలేదు.
అంచనాలు పెట్టుకోకుండా చూస్తే...
సారంగదరియా మంచి మెసేజ్‌తో కూడిన ఫ్యామిలీ మూవీ. సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే సారంగదరియా మెప్పిస్తుంది.
రేటింగ్ : 2.5/5