తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Iifa 2022: డబ్బులు లేవు.. అవకాశాలూ లేవు.. ఐఫాలో కంటతడి పెట్టిన సల్మాన్‌

IIFA 2022: డబ్బులు లేవు.. అవకాశాలూ లేవు.. ఐఫాలో కంటతడి పెట్టిన సల్మాన్‌

Hari Prasad S HT Telugu

06 June 2022, 15:26 IST

google News
    • బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ సూపర్‌ స్టార్‌. అభిమానులు అతన్ని ముద్దుగా సల్లూ భాయ్‌ అని పిలుచుకుంటారు. అతడి పేరు ఎప్పుడు విన్నా.. ఎంతో చలాకీగా, నవ్వుతూ ఉండే అతని రూపమే కనిపిస్తుంది. అయితే ఐఫా అవార్డుల్లో మాత్రం అతడు కంటతడి పెట్టడం అభిమానులను కలచివేస్తోంది.
ఐఫా 2022లో సల్మాన్ ఖాన్
ఐఫా 2022లో సల్మాన్ ఖాన్ (ANI)

ఐఫా 2022లో సల్మాన్ ఖాన్

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ భావోద్వేగాలకు గురైన సందర్భాలు చాలా అరుదు. కెరీర్‌ మొదట్లో లవర్‌ బోయ్‌ క్యారెక్టర్లతో, ఆ తర్వాత తన కండలతో యూత్‌ను అట్రాక్ట్ చేశాడు సల్మాన్‌. ఎప్పుడూ చలాకీగా, నవ్వుతూ అభిమానులకు కనిపించే అతడు.. తొలిసారి ఐఫా 2022లో మాత్రం కంటతడి పెట్టాడు. ఇండస్ట్రీలో తాను పడిన కష్టాల గురించి చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

మైనే ప్యార్‌ కియాలాంటి సూపర్‌ హిట్‌ మూవీతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా తనకు అవకాశాలు రాలేదని, చేతిలో డబ్బు లేక ఇబ్బందులు పడ్డానని చెబుతూ సల్మాన్‌ కంటతడి పెట్టాడు. మైనే ప్యార్‌ కియా క్రెడిట్‌ అంతా భాగ్యశ్రీ కొట్టేసిందని చెప్పి వాపోయిన అతడు.. తన కెరీర్‌ను గాడిన పెట్టిన దర్శకుడు రమేష్‌ తౌరాణీకి కృతజ్ఞతలు చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

"మైనే ప్యార్‌ రియా రిలీజైన తర్వాత భాగ్యశ్రీ ఇక సినిమాలు తీయనని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. మొత్తం క్రెడిట్‌ అంతా ఆమెనే తీసుకెళ్లింది. ఆరు నెలల పాటు నాకు ఒక్క సినిమా కూడా లేదు. ఆ సమయంలోనే దేవుడిలాంటి మనిషి రమేష్‌ తౌరాణీ నా జీవితంలోకి ప్రవేశించాడు. అదే సమయంలో మా నాన్న జీపీ సిప్పీకి రూ.2 వేలు ఇచ్చి మరీ ఇండస్ట్రీ మ్యాగజైన్‌లో నేనో సినిమా చేయబోతున్నట్లు ఓ వార్తను ప్రచురింపజేశాడు. కానీ నిజానికి సినిమా ఏమీ లేదు. కానీ రమేష్‌ తౌరాణీ.. సిప్పీ ఆఫీస్‌కు వెళ్లి సినిమా మ్యూజిక్‌ కోసం రూ.5 లక్షలు ఇచ్చాడు. ఆ రూ.5 లక్షల వల్లే చివరికి నేను 1991లో పత్తర్‌ కే ఫూల్‌ సినిమా ఛాన్స్‌ అందుకున్నాను" అని సల్మాన్‌ చెప్పాడు.

తాను కష్టాలు పడుతున్న సమయంలో తాను చాలా కాలంగా కావాలనుకుంటున్న షర్ట్‌, వాలెట్‌ను సునీల్‌ శెట్టి ఇచ్చాడని చెబుతూ సల్మాన్‌ కంటతడి పెట్టాడు. తన దగ్గర వాటికి డబ్బులు లేకపోవడంతో సునీల్ శెట్టి ఇచ్చినట్లు చెప్పాడు. ఆ విషయం చెబుతూ అక్కడే ఉన్న సునీల్‌ శెట్టి తనయుడు అహాన్‌ శెట్టిని సల్మాన్‌ హత్తుకున్నాడు. ఇక 2008లో వాంటెడ్‌తో తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టిన బోనీ కపూర్‌కు కూడా థ్యాంక్స్‌ చెబుతూ అతన్ని కూడా కౌగిలించుకున్నాడు.

తదుపరి వ్యాసం