Salman Khan death threat: సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు.. రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం అంటూ..
30 October 2024, 13:01 IST
Salman Khan death threat: సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి. రూ.2 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ ను బెదిరించడం గమనార్హం.
సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు.. రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం అంటూ..
Salman Khan death threat: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్స్, మెసేజెస్ ఆగడం లేదు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పుడైతే అతని వెంట పడిందో.. అప్పటి నుంచీ ఇవి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ మెసేజ్ ల ద్వారా రూ.2 కోట్లు ఇవ్వాలని సల్మాన్ ను డిమాండ్ చేసినట్లు ముంబై పోలీస్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ కు సందేశం వచ్చింది.
ఇవ్వకుంటే సల్మాన్‌ను చంపేస్తాం
తాము డిమాండ్ చేసినట్లు రూ.2 కోట్లు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ గుర్తు తెలియని వ్యక్తి వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు వెంటనే వర్లీ పోలీస్ కు సమాచారం అందించారు. వాళ్ల ఆ గుర్తు తెలియని వ్యక్తిని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు.
ఈ మధ్యే సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించిన 20 ఏళ్ల వ్యక్తిని ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ తో పాటు ఎన్సీపీ నేత జీషాన్ సిద్ధిఖీని చంపుతానని అతడు హెచ్చరించాడు. అతన్ని సోమవారం (అక్టోబర్ 28) అరెస్ట్ చేశారు.
గత శుక్రవారం అతడు ఎన్సీపీ ఎమ్మెల్యే జీషాన్ హెల్ప్ లైన్ నంబర్ కు ఓ బెదిరింపు సందేశం పంపించి.. తర్వాత వాయిస్ కాల్ కూడా చేసినట్లు పోలీసులు చెప్పారు. జీషాన్ తోపాటు సల్మాన్ ఖాన్ ను కూడా చంపేస్తానని అతడు బెదిరించాడు. ఆ తర్వాత ఆ కాల్ ట్రాక్ చేయగా.. నోయిడా నుంచి వచ్చినట్లు గుర్తించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ కోసం తీసుకొచ్చారు.
సల్మాన్‌కు బెదిరింపులు
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట సల్మాన్ ఖాన్ కు కొన్నాళ్లుగా బెదిరింపు కాల్స్, మెసేజీలు వస్తున్నాయి. ఆ మధ్య అతని ఇంటిపై కాల్పులు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతని సన్నిహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్ కు భద్రతను పెంచారు. గత వారం కూడా లారెన్స్ బిష్ణోయ్ పేరు మీద సల్మాన్ కు బెదిరింపు కాల్ వచ్చింది.
అందులో రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. ఆ కాల్ చేసిన వ్యక్తిని జంషెడ్‌పూర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ సందేశం రావడం గమనార్హం. ఎప్పుడో 26 ఏళ్ల కిందట రాజస్థాన్ లో కృష్ణ జింకను చంపిన కేసుకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఇప్పటికీ సల్మాన్ వెంట పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత మధ్య అతడు తన షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.