Lawrence Bishnoi : లారెన్స్ బిష్ణోయ్‌ని చంపితే కోటి రూపాయలు.. జైలులోని ఖైదీలకు కర్ణి సేన ఆఫర్
Lawrence Bishnoi : లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుకు కోటి రూపాయలకుపైగా నగదు ఆఫర్ చేసిన కర్ణి సేన.. తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. జైలులో ఖైదీలకు కూడా ఇదే ఆఫర్ ప్రకటించింది.
లారెన్స్ బిష్ణోయ్‌ని అంతమొందించేందుకు కర్ణి సేన పోలీసు అధికారులకు ఇటీవల రూ.1,11,11,111 ఆఫర్ చేసిన విషయయం తెలిసిందే. తాజాగా మరో సంచనల ప్రకటన చేసింది. జైలులోని ఖైదీలకు అదే ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను హతమార్చిన ఖైదీలకు క్షత్రియ కర్ణి సేన అధినేత రాజ్ షెకావత్ నగదు బహుమతిని ప్రకటించారు. లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్‌లో అంతమొందించిన పోలీసు అధికారులకు ఆఫర్ చేసిన కొద్ది రోజుల తర్వాత తాజా ప్రకటన వచ్చింది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో కర్ణి సేనకు చెందిన రాజ్ షెకావత్ తన ఉద్దేశాలను చెప్పాడు. జైలు ఆవరణలో లారెన్స్ బిష్ణోయ్‌ని చంపిన ఖైదీలకు అదే రివార్డ్‌ను అందజేస్తామని ప్రకటించారు. 'నేను ప్రకటించిన రూ.1,11,11,111 రివార్డ్ లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుకు ఇస్తాం. అంతేకాదు.. సబర్మతి జైలులో ఉన్న ఖైదీ ఎవరైనా లారెన్స్ బిష్ణోయ్‌ని చంపినట్లయితే, క్షత్రియ కర్ణి సేన అతనికి అదే బహుమతిని ఇస్తుంది.' అని షెకావత్ చెప్పారు.
లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం స్మగ్లింగ్ కేసులో గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు. ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన కేసులో కూడా అతని పేరు ఉంది. అయితే ముంబై పోలీసులు అతనిని అదుపులోకి తీసుకోలేకపోయారు.
డిసెంబర్ 5, 2023న జైపూర్‌లో గుర్తుతెలియని దుండగులు కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి కాల్చి చంపారు. అతని హత్యకు కొన్ని గంటల తర్వాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. దీంతో అప్పటి నుంచి కర్ణిసేన లారెన్స్ బిష్ణోయ్‌పై కోపం పెంచుకుంది.
బిష్ణోయ్ క్రిమినల్ సిండికేట్ దేశవ్యాప్తంగా పని చేస్తూనే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల కిందట బాబా సిద్ధిఖి హత్య, సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ముంబైలో జరిగిన సిద్ధిఖి హత్యలో అతని ప్రమేయం గురించి వార్తలు వచ్చాయి. అలాగే నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల కారణంగా బిష్ణోయ్ మీదకు అందరి దృష్టి వెళ్లింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాబా సిద్ధిఖిని డాన్ దావూద్ ఇబ్రహీంతో లింకులు, సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాల కారణంగా హత్య చేసిందని అంటున్నారు. సల్మాన్ ఖాన్‌కు, అతని కుటుంబానికి గత కొన్ని సంవత్సరాలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి అనేకసార్లు హత్య బెదిరింపులు వెళ్లాయి. సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ పెరిగింది.