Baba Siddique Murder Case : బాబా సిద్ధిఖి హత్య కేసు.. స్క్రాప్ డీలర్‌ను అరెస్టు చేసిన పోలీసులు-baba siddique murder case mumbai crime branch police arrest scrap dealer heres why ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Baba Siddique Murder Case : బాబా సిద్ధిఖి హత్య కేసు.. స్క్రాప్ డీలర్‌ను అరెస్టు చేసిన పోలీసులు

Baba Siddique Murder Case : బాబా సిద్ధిఖి హత్య కేసు.. స్క్రాప్ డీలర్‌ను అరెస్టు చేసిన పోలీసులు

Anand Sai HT Telugu
Oct 20, 2024 09:40 PM IST

Baba Siddique Murder Case : బాబా సిద్ధిఖి హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుంటున్నారు పోలీసులు. తాజాగా స్క్రాప్ డీలర్‌ను అరెస్టు చేశారు. దీంతో నిందితుల సంఖ్య పదికి చేరింది.

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌తో బాబా సిద్ధిఖి
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌తో బాబా సిద్ధిఖి (PTI file photo)

బాబా సిద్ధిఖి హత్య కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం నవీ ముంబైలో స్క్రాప్ డీలర్‌ను అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన వ్యక్తి బాబా సిద్ధిఖిని చంపిన వ్యక్తులకు ఆయుధాన్ని అందించినట్లు ఆరోపణలు వచ్చాయి. అరెస్టుతో కస్టడీలో ఉన్న మొత్తం నిందితుల సంఖ్య 10కి చేరుకుంది. తాజాగా అరెస్టు చేసిన నిందితుడిని భగవత్ సింగ్ ఓం సింగ్ (32)గా గుర్తించారు. అతను నవీ ముంబైలో నివసిస్తున్నాడు.

సింగ్‌ను స్థానిక కోర్టు అక్టోబర్ 26 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. బాబా సిద్ధిక్‌ను అతని కుమారుడు జీషన్ సిద్ధిఖి కార్యాలయం వెలుపల ముగ్గురు దుండగులు హత్య చేశారు. గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19) అనే ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రధాన షూటర్ శివకుమార్ గౌతమ్, హత్యకు కుట్ర పన్నిన మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. సంచలనం సృష్టించిన ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. హంతకులకు సహాయ సహకారాలు అందించిన ఐదుగురిని పోలీసులు గత వారం అరెస్టు చేశారు. వారిని నితిన్ గౌతమ్ సప్రే (32), సంభాజీ కిసాన్ పార్ధి (44), ప్రదీప్ దత్తు థోంబ్రే (37), చేతన్ దిలీప్ పార్ధి, రామ్ ఫుల్‌చంద్ కనౌజియా (43)గా గుర్తించారు.

ముంబై క్రైమ్ బ్రాంచ్ నుండి అందిన సమాచారం ప్రకారం బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించిన మొత్తం ప్లానింగ్ పూణేలో జరిగింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇప్పటివరకు చాలా మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. సంఘటన సమయంలో అక్కడ చాలా మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు.

నిందితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఎక్కువగా ఆధారపడినట్లు దర్యాప్తులో తేలింది. కమ్యూనికేషన్ కోసం స్నాప్‌చాట్, కాల్‌ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించారు. దాడికి ముందు 25 రోజుల పాటు సిద్ధిఖీ నివాసం, కార్యాలయంపై నిఘా పెట్టారు. అక్టోబర్ 12 ఘటన జరిగిన కొద్దిసేపటికే షూటర్లు గుర్మైల్ బల్జీత్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్‌లు అరెస్టు అయ్యారు. నిందితులు యూట్యూబ్ వీడియోలను చూసి శిక్షణ పొందారని తెలుస్తోంది.

Whats_app_banner