Lawrence Bishnoi : లారెన్స్ బిష్ణోయ్ నెక్ట్స్ టార్గెట్ రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ.. నటుడి పోస్ట్ వైరల్
Lawrence Bishnoi Next Target : లారెన్స్ బిష్ణోయ్ తదుపరి టార్గెట్ రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ అని ఒడియా నటుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ అయింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి.
ఒడియా సినీ నటుడు బుద్ధాదిత్య మొహంతి ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌లపై సోషల్ మీడియా పోస్ట్‌తో రాజకీయ దుమారం రేపారు. మొహంతి వివాదాస్పద పోస్ట్‌లో బిష్ణోయ్ తదుపరి టార్గెట్స్ రాహుల్ గాంధీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అని అన్నారు.
'జర్మనీలో గెస్టాపో ఉంది.. ఇజ్రాయెల్‌లో మొసాద్ ఉంది.. USAలో CIA ఉంది.. ఇప్పుడు భారత్‌లో లారెన్స్ బిష్ణోయ్ ఉన్నారు.. ఆ జాబితాలో నెక్ట్స్ టార్గెట్ ఒవైసీ, రాహుల్ గాంధీ ఉన్నారు.' అని బుద్ధాదిత్య పోస్ట్ చేశారు.
మొహంతి చేసిన ఈ పోస్ట్ రాజకీయంగా దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అయిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) అతనిపై పోలీసు ఫిర్యాదు చేసింది. ఒడిశా ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ భువనేశ్వర్ క్యాపిటల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ పోస్ట్‌కు మొహంతిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖిని చంపిన తర్వాత, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తదుపరి టార్గెట్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అని మొహంతి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు. మా నాయకుడిపై అలాంటి వ్యాఖ్యను మేం సహించలేం' అని ఉదిత్ అన్నారు. ఎన్ఎస్‌యూఐ ఫిర్యాదుతో పాటు సోషల్ మీడియా పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను కూడా సమర్పించింది. ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
దీనిపై మొహంతి సోషల్ మీడియాలో బహిరంగ క్షమాపణలు చెప్పారు. రాహుల్ గాంధీని ఏ విధంగానూ కించపరచడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. 'రాహుల్ గాంధీకి సంబంధించి నా గత పోస్ట్.. ఎప్పుడూ ఆయనను టార్గెట్ చేయడం..హానీ చేయడం, కించపరచడం..అతనికి వ్యతిరేకంగా ఏమీ రాయలేదు.. అనుకోకుండా నేను ఎవరి మనోభావాలను ప్రభావితం చేసి ఉంటే.. నా ఉద్దేశం ఇది కాదు. హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాను.' అని బుద్ధాదిత్య మొహంతి అన్నారు.
ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖిను బాంద్రాలో కాల్చి చంపిన కొద్ది రోజుల తర్వాత ఈ పోస్ట్ చేశాడు నటుడు బుద్ధాదిత్య మెుహంతి. సిద్ధిఖికి మూడు బుల్లెట్లు తగిలాయి. ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్టోబర్ 12న మరణించారు.
సోషల్ మీడియా పోస్ట్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్ధిఖి హత్యకు బాధ్యత వహించింది. దావూద్ ఇబ్రహీంతో, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాల కారణంగా సిద్ధిఖిని లక్ష్యంగా చేసుకున్నట్టుగా పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరు తెలిపారు.