Jharkhand polls: జార్ఖండ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న జేఎంఎం-కాంగ్రెస్; ఇతర మిత్రపక్షాలతో చర్చలు-jharkhand polls jmm cong to contest 70 of 81 seats talks on with other allies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jharkhand Polls: జార్ఖండ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న జేఎంఎం-కాంగ్రెస్; ఇతర మిత్రపక్షాలతో చర్చలు

Jharkhand polls: జార్ఖండ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న జేఎంఎం-కాంగ్రెస్; ఇతర మిత్రపక్షాలతో చర్చలు

Sudarshan V HT Telugu

Jharkhand polls: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం కలిసి పోటీ చేయనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు గానూ 70 సీట్లను ఈ రెండు పార్టీలు పంచుకుంటాయి. 11 స్థానాలను ఇతర మిత్రపక్షాలకు వదిలేశాయి.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, రాహుల్ గాంధీ (PTI)

Jharkhand polls: రాబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కలిసి పోటీ చేస్తాయని, 81 స్థానాలకు గాను 70 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం ప్రకటించారు. మిగిలిన 11 స్థానాల కోసం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), వామపక్షాలు సహా మిత్రపక్షాలతో సీట్ల పంపకాల చర్చలు కొనసాగుతున్నాయి.

అధికారం నిలబెట్టుకుంటుందా?

ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా జేఎంఎం ఉంది. 30 మంది ఎమ్మెల్యేలతో ఈ పార్టీ అధికార పార్టీగా ఉంది. భారతీయ జనతా పార్టీకి 25 మంది, కాంగ్రెస్ కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీకి 68 సీట్లలో పోటీ చేయనుంది. మిత్రపక్షాలకు 13 సీట్లను వదిలేసింది. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.

రెండు దశల్లో పోలింగ్

81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ జరగనుండగా, మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడత ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా కాంగ్రెస్ సీనియర్ నేతలను నియమించింది.

జార్ఖండ్ లో రాహుల్ గాంధీ

జార్ఖండ్ లో జరుగుతున్న 'సంవిధాన్ సమ్మేళన్'లో పాల్గొనేందుకు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం రాంచీకి బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు రాంచీలో జరిగే కార్యక్రమంలో ఆయన ప్రసంగించనున్నారు. దేశమంతా నడిచిన రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేయాలని, ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేశారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ అన్నారు. ‘‘అణగారిన వర్గాల కోసం మాట్లాడటానికి ఆయన ఇక్కడకు వచ్చారు. వారి గొంతులు అరుదుగా వినబడతాయి. ఈ ప్రోగ్రాం చాలా ముందుగానే ప్లాన్ చేశారు. అందుకోసం రాహుల్ గాంధీ (rahul gandhi) వస్తున్నారు’’ అని చెప్పారు.

త్వరలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్

అక్టోబర్ 19 తర్వాత కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, జార్ఖండ్ ఇంచార్జ్ గులాం అహ్మద్ మీర్ గురువారం తెలిపారు. 2019లో మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తామన్నారు. సీట్ల పంపకం దాదాపు ఖరారైందన్నారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.