Salaar 7 days Box Office collections: సలార్ దూకుడు.. 7 రోజుల్లోనే ఇండియాలో రూ.300 కోట్లు
28 December 2023, 22:06 IST
- Salaar 7 days Box Office collections: బాక్సాఫీస్ దగ్గర సలార్ ఊచకోత కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా ఏడు రోజుల్లోనే ఇండియాలో రూ.300 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లు సాధించడం విశేషం.
సలార్ మూవీలో ప్రభాస్
Salaar 7 days Box Office collections: ప్రభాస్ నటించిన సలార్ మూవీ తొలి వారంలోనే బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. షారుక్ ఖాన్ డంకీ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. ఆ మూవీని వెనక్కి నెట్టి దానికంటే రెట్టింపు వసూళ్లు రాబట్టడం విశేషం. తొలి ఏడు రోజుల్లోనే ఈ సినిమా ఇండియాలో రూ.300 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ఏడో రోజు కలెక్షన్లు తగ్గినప్పటికీ ఓవరాల్‌గా డంకీ కంటే ఎంతో మెరుగ్గానే ఉంది.
సలార్ మూవీ ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా కలెక్షన్లతో సంచలనం సృష్టించగా.. ఏడో రోజు మరో మైలురాయి అందుకుంది. ఈసారి ఇండియాలో రూ.300 కోట్లను దాటింది. ఏడో రోజు రూ.10 కోట్లలోపే వసూళ్లు సాధించినా.. చివరికి రూ.304 కోట్ల నెట్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. క్రిస్మస్ అయిన సోమవారం (డిసెంబర్ 25) వరకూ భారీగా వసూళ్లు సాధించినా.. తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
తొలి రోజు ఇండియాలో రూ.90.7 కోట్లతో రికార్డు క్రియేట్ చేసిన సలార్.. రెండో రోజు రూ.56.35 కోట్లు, మూడో రోజు రూ.62.05 కోట్లు, నాలుగో రోజు రూ.46.3 కోట్లు, ఐదో రోజు రూ.24.9 కోట్లు, ఆరో రోజు రూ.15.1 కోట్లు వసూలు చేసింది. ఏడో రోజు మరో రూ.8 కోట్ల వసూళ్లతో మొత్తంగా రూ.300 కోట్ల మార్క్ దాటింది. ఈ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు రూ.190 కోట్ల వరకూ రావడం విశేషం.
హిందీ బెల్ట్ లో డంకీ నుంచి పోటీ ఎదురుకావడంతో అక్కడ ఆశించిన మేర కలెక్షన్లు రాలేదు. హిందీలో మూడో రోజు అత్యధికంగా రూ.21 కోట్లు వచ్చాయి. ఇక మిగతా సౌత్ భాషల్లో సలార్ కు పెద్దగా ఆదరణ లభించలేదు. ప్రశాంత్ నీల్ సొంత రాష్ట్రమైన కర్ణాటకతోపాటు తమిళనాడు, కేరళల్లో సలార్ వసూళ్లు నిరాశ పరిచాయి. అయితే హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్ కు ఈ వసూళ్లు ఎంతో ఊరట కలిగించేవే.
ఇప్పుడు మరో లాంగ్ వీకెండ్ రానుండటంతో మరోసారి సలార్ వసూళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇటు తెలుగులో, అటు హిందీలో ఈ వీకెండ్ పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. దీంతో శని, ఆది, సోమవారాల్లో (జనవరి 1) సలార్ సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి.