Saindhav OTT Streaming: రేపే ఓటీటీలోకి సైంధవ్ సినిమా: ఎక్కడ చూడొచ్చు?
02 February 2024, 18:15 IST
- Saindhav OTT Release Date: సైంధవ్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ చిత్రం ఓటీటీ డిటైల్స్ ఇవే.
Saindhav OTT Streaming: రేపే ఓటీటీలోకి సైంధవ్ సినిమా: ఎక్కడ చూడొచ్చు?
Saindhav OTT Streaming details: సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 13న థియేటర్లలో రిలీజైంది. చాలా కాలం తర్వాత వెంకీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ క్యారెక్టర్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి క్రేజ్ నెలకొంది. అందులోనూ ‘హిట్’ లైనప్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించటంతో సైంధవ్‍పై మరింత ఆసక్తి నెలకొంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు, సైంధవ్ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధమైంది.
థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి సైంధవ్ వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లో రేపు (ఫిబ్రవరి 3) ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. అర్ధరాత్రి 12 గంటలకే ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది.
సైంధవ్ మూవీ కూతురు సెంటిమెంట్, యాక్షన్ ప్రధాన అంశాలుగా వచ్చాయి. ఈ చిత్రంలో వెంకటేశ్‍కు జోడీగా శ్రద్ధ శ్రీనాథ్ నటించారు. వెంకీ కూతురు పాత్రలో మెప్పించారు బేబి సారా. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్ర పోషించారు. తమిళ హీరో ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, జిషు సెంగుప్త, ముకేశ్ రుషి ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు.
పేలవంగా కలెక్షన్లు
సైంధవ్ సినిమా రూ.50కోట్లకు పైగా బడ్జెట్‍తో రూపొందింది. అయితే, సుమారు రూ.20 కోట్ల వసూళ్లనే రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాలతో వచ్చి చతికిలపడింది. గత డిసెంబర్‌లోనే రిలీజ్ కావాల్సిన సైంధవ్ మూవీ.. సలార్ వల్ల ఈ ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది. అయితే, పండగ సీజన్‍లో వచ్చినా ఆశించిన కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది.
సైంధవ్ మూవీలో వెంకటేశ్ యాక్షన్ ఆకట్టుకుంది. అయితే, దర్శకుడు శైలేశ్ కొలను ఈ మూవీని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొదటి నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకొని చివరికి ఫ్లాప్‍గా నిలిచింది. నిహారిక ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.
సైంధవ్ స్టోరీ ఇదే..
సైంధవ్ సినిమా చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ సిటీలో జరుగుతుంది. హింసాత్మక గతం ఉన్న సైంధవ్ కోనేరు అలియాజ్ సైకో (వెంకటేశ్) ఆ ప్రాంతంలో ఉంటారు. తన కూతురు గాయత్రి (సారా పాలేకర్)తో కలిసి సైంధవ్ జీవనం సాగిస్తుంటారు. గాయత్రికి కేర్ టేకర్‌గా మనోజ్ఞ (శ్రద్ధ శ్రీనాథ్) ఉంటారు. గతంలో తన భార్యకు ఇచ్చిన మాట కోసం నేర ప్రపంచాన్ని వీడి కూతురు కోసమే సైంధవ్ జీవిస్తుంటారు. ఈ క్రమంలో ఒక రోజు స్కూల్‍లో కిందపడుతుంది గాయత్రి. ఆమె స్పైనల్ మస్క్యూలర్ అట్రాఫీ అనే ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్టు డాక్టర్లు చెబుతారు. ఆ వ్యాధి తగ్గాలంటే గాయత్రికి రూ.17కోట్లతో ఇంజెక్షన్ వేయాలని చెబుతారు. మరి ఆ తర్వాత సైంధవ్ ఏం చేశాడు? తన కూతురిని కాపాడుకోగలిగాడా? అతడి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే సైంధవ్ మూవీ స్టోరీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
టాపిక్