RRR Twitter Review | ‘ఆర్ఆర్ఆర్’ ట్విట్టర్ రివ్యూ… ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా
25 March 2022, 6:20 IST
గత ఏడాదికాలంగా తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ పీరియాడికల్ చిత్రంతో రాజమౌళి గత సినిమాల రికార్డులను చెరిపివేశాడా? పాన్ ఇండియన్ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా అన్నది చూద్దాం...
ఎన్టీఆర్,రామ్ చరణ్
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియన్ స్థాయిలో సినీ వర్గాల దృష్టిని ఆకర్షించిన తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ టాలీవుడ్ అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలయికలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురంభీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించడంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపైంది. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ తో పాటు అగ్రనటుడు అజయ్ దేవ్‌గణ్ ఇందులో కీలక పాత్రలను పోషించారు. హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ మరో హీరోయిన్‌గా కనిపించింది. వీరితో పాటు భిన్న భాషలకు చెందిన నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. దాదాపు నాలుగు వందల కోట్ల వ్యయంతో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందా? ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులను ఆకట్టుకున్నారా అనేదాని గురించి ట్విట్టర్ లో అభిమానులు ఎమంటున్నారంటే...
1920 టైమ్‌లో ఆదిలాబాద్ లోని గిరిజన ప్రాంత నేపథ్యంలో సినిమా మొదలవుతుందని తెలిసింది. గిరిజన గూడానికి చెందిన మల్లి అనే చిన్నారిని బ్రిటీషర్లు బలవంతంగా ఢిల్లీ తీసుకుపోతారు. ఆమెను తిరిగి తమ ఊరికి తీసుకురావడానికి భీమ్ కూడా ఢిల్లీ వెళతాడని తెలిసింది. బ్రిటీషర్లపై పోరాటానికి సిద్ధపడతాడు. అతడిని పట్టుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం రామరాజు అనే పోలీస్ ఆఫీసర్‌ను నియమిస్తుంది. ద్వేషంతో మొదలైన భీమ్, రామరాజు ప్రయాణం ఎలా స్నేహంగా మారింది. ఇద్దరు కలిసి లక్ష్యసాధన కోసం సాగించిన పోరాటాన్ని రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ లో హీరోయిజం, ఎమోషన్స్ ఎలివేషన్స్‌తో ఆసక్తికరంగా చూపించారని అంటున్నారు.
సినిమాలో ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేసి చూపినట్లు పలు ఇంటర్వ్యూల్లో రాజమౌళి చెప్పారు. కానీ వాస్తవంలో మాత్రం ఎన్టీఆర్ తో పోలిస్తే రామ్ చరణ్ క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్ నుంచి పోరాట యోధుడిగా ఎలా మారాడనేది డిఫరెంట్ వేరియేషన్స్ తో రామ్ చరణ్ పాత్రను రాజమౌళి తీర్చిదిద్దారని అంటున్నారు. అతడిపై వచ్చే ఎలివేషన్స్ అన్ని ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఎన్టీఆర్‌కు, చరణ్‌కు మధ్య వచ్చే ఫైట్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం.
భీమ్ అనే గిరిజన కాపరిగా ఎన్టీఆర్ పాత్ర ఆద్యంతం ఎమోషనల్‌గా సాగుతుందని పేర్కొంటున్నారు. తన నటన, డైలాగ్ డెలివరీ విభిన్నంగా ఉంటాయని అంటున్నారు. ఇద్దరు హీరోల బాండ్‌ను, వారి పోరాటాన్ని దర్శకుడు రాజమౌళి చక్కగా తెరపై చూపించారని చెబుతున్నారు. అజయ్‌దేవ్‌గణ్, శ్రియ ఒలివియా మోరీస్ పాత్రలకు స్ర్కీన్ టైమ్ తక్కువగా ఉంటుందని సమాచారం. అలాగే అలియాభట్ లోని యాక్టింగ్ టాలెంట్‌ను రాజమౌళి పూర్తిగా వాడుకోలేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఆమె క్యారెక్టర్ సినిమాలో కొన్ని నిమిషాలే కనిపిస్తుందని అంటున్నారు.
ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. క్లైమాక్స్ ఫైట్‌ను భారీ స్థాయిలో వైవిధ్యంగా డిజైన్ చేసినట్లు తెలిసింది.రాజమౌళి గత సినిమాలతో పోలిస్తే క్యారెక్టర్స్ విషయంలో ఎమోషన్స్ సరిగా పండలేదనే విమర్శలు వస్తున్నాయి. కానీ హీరోల ఎలివేషన్స్‌ను అద్భుతంగా చూపించి ఫ్యాన్స్‌ను రాజమౌళి పూర్తిగా సంతృప్తిపరచాడని అంటున్నారు.
టాపిక్