Rohit Ruled out of First Test: బంగ్లాతో తొలి టెస్టుకు రోహిత్ దూరం.. రాహుల్‌కు పగ్గాలు
12 December 2022, 7:17 IST
- Rohit Ruled out of First Test: బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం కల్పించింది.
రోహిత్ శర్మ
Rohit Ruled out of First Test: బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ చివరి మ్యాచ్‌లో గెలిచి విజయంతో ముగించుకుంది. ఫలితంగా సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్టు సిరీస్‌పైన దృష్టి పెట్టింది. ఈ నెల 14 నుంచి తొలి టెస్టు ఆరంభం కాబోతున్న తరుణంలో భారత్‌కు గట్టి షాక్ తగిలింది. రెండో వన్డే సందర్భంగా బొటనవేలు గాయంతో ఇబ్బంది పడిన రోహిత్ శర్మ మొదటి టెస్టుకు కూడా దూరంగా ఉండనున్నాడు. ఇప్పటికే మూడో వన్డేలోనూ రోహిత్ ఆడకపోవడంతో.. అతడు స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ వన్డేల్లో తొలి సెంచరీనే డబుల్‌గా మలచి విజృంభించాడు. తాజాగా తొలి టెస్టుకు దూరం కానుండటంతో హిట్ మ్యాన్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం కల్పించింది బీసీసీఐ.
అభిమన్యు ఈశ్వరన్ ఇటీవలే బంగ్లాదేశ్-ఏ.. భారత్-ఏ మధ్య జరిగిన నామమాత్రపు రెండు టెస్టుల సిరీస్ జట్టులో సభ్యుడు. అతడు ఈ రెండు మ్యాచ్‌ల్లో 299 పరుగులు చేశాడు. ఫలితంగా రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను అవకాశం కల్పించారు. హిట్ మ్యాన్ గైర్హాజరు కానుండటంతో కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలను నిర్వహించనున్నాడు.
"ఎడమ బొటనవేలుకు గాయం కావడంతో రోహిత్ శర్మ ముంబయిలో ఓ స్పెషలిస్టును సంప్రదించాడు. ఆయన సలహా మేరకు బంగ్లాదేశ్‌తో జరగనున్న మొదటి టెస్టుకు కూడా హిట్ మ్యాన్‌కు విశ్రాంతి ఇచ్చాం. తదుపరి మ్యాచ్‌కు రోహిత్ ఆడేది లేనిది బీసీసీఐ వైద్యబృందం పరిశీలించి.. నిర్ణయం తీసుకుంటుంది. హిట్ మ్యాన్ స్థానంలో తొలి టెస్టుకు అభిమన్యు ఈశ్వరన్‌కు సీనియర్ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది." అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటికే మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆటకు దూరం కావడంతో వారి స్థానంలో నవ్‌దీప్ సైనీ, సౌరబ్ కుమార్ భారత జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
"ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. భుజం, మోకాలి గాయంతో బాధపడుతుండటంతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యారు. వీరి స్థానంలో సెలక్టర్లు నవదీప్ సైనీ, సౌరబ్ కుమార్‌ను తీసుకుంది. వీరితో పాటు టెస్టు సిరీస్‌కు జయదేవ్ ఉనాద్కట్‌ను తీసుకుంది." అని బీసీసఐ స్పష్టం చేసింది.
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు..
కేఎల్ రాహుల్(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, నవదీప్ సైనీ, సౌరబ్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్.