Jay Shah on Rohit Sharma: టెస్ట్ సిరీస్‌కు రోహిత్ ఉంటాడా లేదా.. బీసీసీఐ సెక్రటరీ జై షా ఇచ్చిన అప్‌డేట్ ఇదీ
Jay Shah on Rohit Sharma: టెస్ట్ సిరీస్‌కు రోహిత్ ఉంటాడా లేదా అన్న సందేహాల మధ్య బీసీసీఐ సెక్రటరీ జై షా కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు. వేలి గాయంతో మూడో వన్డేకు దూరమైన రోహిత్.. టెస్ట్ సిరీస్‌కైనా తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Jay Shah on Rohit Sharma: టీమిండియాను వరుసగా గాయాలు, ఓటములు వేధిస్తూనే ఉన్నాయి. తాజాగా గాయపడిన వాళ్ల లిస్ట్‌లో కెప్టెన్ రోహిత్ కూడా చేరాడు. అతడు బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. అతని ఎడమచేతి బొటన వేలికి తీవ్ర గాయమైంది. రెండో వన్డేలో అతడు అలాగే బ్యాటింగ్ చేసినా.. మూడో వన్డే మాత్రం ఆడటం లేదు.
స్పెషలిస్ట్ సూచనల కోసం అతడు ముంబై వెళ్లాడు. టెస్ట్ సిరీస్‌కు కూడా రోహిత్ తిరిగి రావడం అనుమానమే అన్న వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో ఇండియా ఎ టీమ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.
"బీసీసీఐ మెడికల్ టీమ్ రోహిత్ పరిస్థితిని అంచనా వేసింది. అతనికి ఢాకాలోని స్థానిక హాస్పిటల్‌లో స్కానింగ్ నిర్వహించారు. స్పెషలిస్ట్ సలహా కోసం ముంబై వచ్చాడు. మూడో వన్డే ఆడటం లేదు. టెస్ట్ సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం" అని జై షా ఆ ప్రకటనలో చెప్పారు.
బీసీసీఐ రోహిత్ ఫిట్‌నెస్‌పై స్పష్టంగా చెప్పకపోయినా.. అతని బొటన వేలి గాయం చూస్తే మాత్రం డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్ కల్లా కోలుకుంటాడన్న నమ్మకమైతే లేదు. అతని వేలి ఎముక పక్కకు జరిగింది. ఇది సెట్ కావాలంటే కనీసం రెండు వారాల సమయమైనా పడుతుంది. ఇక వేలు తెగడంతో దానికి కుట్లు కూడా అవసరం.
ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ టెస్టుల్లో ఆడటం దాదాపు అసాధ్యం. రెండో వన్డేలో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగి చివరి వరకూ పోరాడినా టీమ్‌ను గెలిపించలేకపోయాడు. ఒకవేళ రోహిత్ రాలేకపోతే కేఎల్ రాహుల్ కెప్టెన్ అవుతాడు. ఈశ్వరన్ అతని స్థానంలో టీమ్‌లోకి వస్తాడు. రోహితే కాదు.. టెస్టులకు జడేజా, షమి కూడా అందుబాటులో ఉండటం లేదన్న వార్తలూ వస్తున్నాయి. అదే జరిగితే టీమ్ కష్టాలు మరింత ఎక్కువవుతాయి.