BCCI about Team India: అవమానకరంగా ఉంది.. బంగ్లాదేశ్‌తో ఇండియా ఓడిపోతుందని అనుకోలేదు: బీసీసీఐ-bcci about team india performance against bangladesh says its embarrassing ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Bcci About Team India Performance Against Bangladesh Says Its Embarrassing

BCCI about Team India: అవమానకరంగా ఉంది.. బంగ్లాదేశ్‌తో ఇండియా ఓడిపోతుందని అనుకోలేదు: బీసీసీఐ

Hari Prasad S HT Telugu
Dec 08, 2022 02:40 PM IST

BCCI about Team India: ఇది అవమానకరంగా ఉంది.. బంగ్లాదేశ్‌తో ఇండియా ఓడిపోతుందని అనుకోలేదని బీసీసీఐ అనడం గమనార్హం. బంగ్లాతో వన్డే సిరీస్‌ ఓటమి తర్వాత బోర్డు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

బంగ్లాదేశ్ తో సిరీస్ ఓటమిని సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ
బంగ్లాదేశ్ తో సిరీస్ ఓటమిని సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ (ANI )

BCCI about Team India: మొదట సౌతాఫ్రికా, ఆ తర్వాత ఆసియాకప్‌, టీ20 వరల్డ్‌కప్‌, ఇప్పుడు బంగ్లాదేశ్‌.. ఇలా 2022లో ఇండియా వరుసగా సిరీస్‌లు ఓడిపోయింది. ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని టీమ్‌గా పేరొందినా.. స్టార్‌ ప్లేయర్స్‌తో నిండిన ఇండియన్‌ టీమ్‌ చివరికి బంగ్లాదేశ్‌తోనూ ఓడిపోవడం బీసీసీఐకి కూడా మింగుడుపడటం లేదు. అందుకే ఈ ఓటమి తర్వాత బోర్డు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

వన్డేల్లో ఏడో ర్యాంక్‌లో ఉన్న బంగ్లాదేశ్‌తో స్టార్‌ ప్లేయర్స్‌ ఉన్న ఇండియన్‌ టీమ్‌ ఓటమి అవమానకరంగా ఉన్నదని బోర్డు అనడం గమనార్హం. బుధవారం (డిసెంబర్‌ 7) జరిగిన రెండో వన్డేలోనూ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఇండియా కోల్పోయింది. అంతకుముందు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయిన ఇండియా.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ఇంటిదారి పట్టింది.

దీంతో జనవరిలో హోమ్‌ సిరీస్‌ ప్రారంభమయ్యే ముందు బీసీసీఐ ఓ కీలకమైన సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో కెప్టెన్‌ రోహిత్‌, కోచ్ ద్రవిడ్‌, ఎన్సీఏ ఛీఫ్ లక్ష్మణ్‌, విరాట్ కోహ్లి పాల్గొననున్నారు. ఇది వరల్డ్‌కప్‌ ఏడాది కావడంతో ఇండియా వరుస ఓటములను బీసీసీఐ సమీక్షించనుంది.

"బంగ్లాదేశ్‌కు వెళ్లే ముందు ఇండియన్‌ టీమ్‌ను కలిసే అవకాశం మాకు దక్కలేదు. ఆ టైమ్‌లో బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు బిజీగా ఉన్నారు. ఇప్పుడు టీమ్‌ బంగ్లాదేశ్‌ నుంచి రాగానే నిర్వహిస్తాం. ఇది చాలా అవమానకరమైన ప్రదర్శన. బంగ్లాదేశ్‌తో ఓడిపోతుందని అస్సలు ఊహించలేదు" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.

ఈ సమావేశంలో రోహిత్‌ కెప్టెన్సీపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాదు రోహిత్‌ శర్మ ఫామ్‌ కూడా ఆందోళనకరంగానే ఉంది. కెప్టెన్‌ అయిన తర్వాత అతని ఆటతీరు దెబ్బతింది. వన్డేల్లో రోహితే కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉన్నా.. టీ20 పగ్గాలు మాత్రం హార్దిక్‌కు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2023లో వన్డే, 2024లో టీ20 వరల్డ్‌కప్‌లు జరగనున్నాయి.

ఇక గాయాల సంఖ్య పెరుగుతుండటంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. టాప్ క్రికెటర్లు గాయాల బారిన పడటం టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. జడేజా, బుమ్రా, దీపక్‌ చహర్‌లాంటి వాళ్లు గాయాల బారిన పడిన విషయం తెలిసిందే.

WhatsApp channel