Rewind Review: రివైండ్ రివ్యూ - లేటెస్ట్ తెలుగు టైమ్ ట్రావెల్ మూవీ ఎలా ఉందంటే?
18 October 2024, 16:50 IST
Rewind Review: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన రివైండ్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో సాయిరోనక్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు.
రివైండ్ రివ్యూ
Rewind Review: సాయి రోనక్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన రివైండ్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి దర్శకనిర్మాతగా వ్యవహరించాడు. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే?
కార్తిక్...శాంతి లవ్‌స్టోరీ...
కార్తిక్(సాయి రోనక్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. తమ అపార్ట్‌మెంట్‌లోకి కొత్తగా వచ్చిన శాంతిని (అమృత చౌదరి)ని చూసి ప్రేమలో పడతాడు. కార్తిక్ పనిచేస్తోన్న ఆఫీస్‌లోనే శాంతి జాబ్‌లో జాయిన్ అవుతుంది. తన మనసులో ఉన్న ప్రేమను ఎలాగైనా శాంతికి చెప్పాలని కార్తిక్ ఎదురుచూస్తుంటాడు.
ఇంతలోనే శాంతి ఐదేళ్లుగా మరో అబ్బాయితోప్రేమలో ఉందనే నిజం కార్తిక్‌కు తెలుస్తుంది. కార్తిక్‌కు తన ప్రియుడిని పరిచయం చేస్తుంది. శాంతి తాత(సామ్రాట్) టైమ్ మిషన్‌ను కనిపెడతాడు. ఆ మిషన్ ద్వారా శాంతి తన ప్రియుడిని కలిసే రోజుకి టైం ట్రావెల్ చేసి వాళ్ళిద్దరిని ఒక్కటి కాకుండా చేయాలని కార్తిక్ నిర్ణయించుకుంటాడు.
టైమ్ ట్రావెల్ మిషన్ ద్వారా శాంతి ప్రేమను దక్కించుకోవచ్చని ఆశపడతాడు. టై ట్రావెల్ మిషన్ ద్వారా కాలంలో వెనక్కి వెళ్లిన కార్తీక్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? శాంతిని అతడు కలుసుకున్నాడా? అసలు శాంతి తాతకు చెందిన బ్యాగ్ కార్తీక్ ఇంటికి ఎలా వచ్చింది?
కరోనా టైమ్‌లోనే చనిపోయిన తన తండ్రిని తిరిగి బతికించుకోవడానికి కార్తిక్ ఏం చేశాడు? టైమ్ మిషన్ ద్వారా అతడి జీవితంలోకి వచ్చిన కొత్త శత్రువులు ఎవరు అన్నదే రివైండ్ మూవీ కథ.
ఆదిత్య 369 నుంచి ఆరంభం వరకు...
టైమ్ ట్రావెల్ జానర్‌లో తెలుగులో చాలా తక్కువ సినిమాలొచ్చాయి. బాలకృష్ణ ఆదిత్య 369 నుంచి ఇటీవల వచ్చిన ఆరంభం వరకు అడపాదడపా దర్శకులు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేశారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ క్లాస్ నుంచి మాస్ ఆడియెన్స్ వరకు అన్ని వర్గాలకు అర్థమయ్యేలా లాజిక్‌లతో స్క్రీన్‌పై ఆవిష్కరించడం అంటే కత్తిమీద సాములాంటిదే. రివైండ్ మూవీతో ఈ సాహసానికి సిద్ధపడ్డాడు డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి.
గతం నుంచి వర్తమానానికి...
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు లవ్‌స్టోరీ, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్‌ను జోడించి ఈ మూవీని తెరకెక్కించాడు. హీరోయిన్ తాత కృష్టమూర్తి క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ రివైండ్ మూవీ మొదలవుతుంది. టైమ్‌మిషన్‌ను కనిపెట్టిన కృష్ణమూర్తి గతం నుంచి వర్తమానానికి వస్తాడు. అక్కడి నుంచి కథను లవ్‌స్టోరీవైపు టర్న్‌చేశాడు డైరెక్టర్. హీరోయిన్‌ను చూసి హీరో ప్రేమలో పడటం, అతడి వన్ సైడ్ లవ్‌ను ఫన్నీగా చూపిస్తూ టైమ్‌పాస్ చేశాడు.
బ్యాక్ టూ బ్యాక్ ట్విస్ట్‌లు...
హీరోయిన్ ప్రేమ కోసం హీరో టైమ్ ట్రావెల్ చేసినట్లుగా చూపించి సెకండాఫ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశాడు డైరెక్టర్. తాను అనుకున్న కాలానికి హీరో వెళ్లాగలిగాడా? టైం ట్రావెల్ చేసి గతాన్ని మార్చాలి అనుకున్న అతడి ప్రయత్నం ఫలించిందా? టైమ్ మిషన్ కనిపెట్టిన హీరో తాత ఎలా కనిపించకుండాపోయాడనే ఒక్కో ప్రశ్నకు సమాధానం ఇస్తూ కథ ముందుకు సాగుతుంది.
వరుసగా ఒకదాని వెంట మరో ట్విస్ట్ వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేయగా...మరికొన్ని తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో తండ్రీకొడుకుల ఎమోషన్‌కు చోటిచ్చాడు. క్లైమాక్స్‌లో రివైండ్‌కు పార్ట్ 2 ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చాడు.
కాన్సెప్ట్ బాగున్నా చాలా చోట్ల దర్శకుడు లాజిక్‌లను వదిలేసినట్లుగా అనిపిస్తుంది. ప్రేమకథలో ల్యాగ్ ఎక్కువైంది. నిర్మాణ పరంగా కొన్నిచోట్ట రాజీపడ్డ భావన కలుగుతుంది.
డిఫరెంట్ వేరియేషన్స్...
కార్తిక్ పాత్రలో సాయిరోనక్ నటన బాగుంది. ప్రియుడిగా, తండ్రిని బతికించుకునేందుకు ఆరాటపడే కొడుకుగా డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో మెప్పించాడు. అమృత చౌదరి తొలి సినిమానే అయినా తన నటనతో మెప్పించింది. సీనియర్ హీరో సురేష్ లాంగ్ గ్యాప్ తర్వాత మంచి పాత్రలో కనిపించాడు.
రివైండ్ కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకుంటుంది. టైమ్ ట్రావెల్ మూవీస్ చూసే ఆడియెన్స్‌ను ఈ మూవీ మెప్పిస్తుంది.
రేటింగ్: 2.75/5