ranbir alia bhatt marriage | రణ్‌భీర్-అలియా పెళ్లికి ముహూర్తం కుదిరిందా?
09 April 2022, 7:26 IST
- బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌భీర్‌కపూర్, అలియాభట్ కలిసి ఏడడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ఈ నెల 14న ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు అలియాభట్ అంకుల్ రాబిన్ భట్ పేర్కొన్నారు.
రణ్‌భీర్‌కపూర్,అలియాభట్
అలియాభట్, రణ్‌భీర్‌కపూర్ పెళ్లి వ్యవహారం బాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్ నెలలోనే ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏప్రిల్ 14న రణ్‌భీర్, అలియా పెళ్లి చేసుకోబోతున్నట్లు అలియా అంకుల్ రాబిన్ భట్ తెలిపారు. ఏప్రిల్ 13న మెహందీ సెలబ్రేషన్స్, 14 వ తేదీన పెళ్లి వేడుక జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అలియా, రణ్‌భీర్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ ఆలోచనను ఈ జంట విరమించుకున్నట్లు సమాచారం. నిరాడంబరంగా కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుకను జరుపుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముంబై బంద్రాలోని రణ్‌భీర్‌కపూర్ నివాసంలోనే సింపుల్‌గా వీరి పెళ్లి జరుగనున్నట్లు తెలిసింది. ఈ ఇంట్లోనే రణ్‌భీర్‌కపూర్ తల్లిదండ్రులు రిషికపూర్, నీతూకపూర్ పెళ్లిచేసుకున్నారు. ఆ సెంటిమెంట్‌ను తాను కొనసాగించాలనే ఆలోచనతోనే రణ్‌భీర్ ముంబైలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
వీరి పెళ్లికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరు కానున్నట్లు తెలిసింది. కరణ్ జోహార్, షారుఖ్‌ఖాన్, సంజయ్‌లీలాభన్సాలీ, అనుష్క రంజన్, వరుణ్ ధావన్, జోయా అక్తర్ తో పాటు మరికొంత మందికి మాత్రమే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. అయితే ఈ పెళ్లి వార్తలపై రణ్‌భీర్‌కపూర్ కుటుంబసభ్యులు మాత్రం పెదవి విప్పడం లేదు.