The warrior movie review: ది వారియర్ మూవీ రివ్యూ.. మూవీ అదిరిందా?
14 July 2022, 16:32 IST
ది వారియర్ మూవీ రివ్యూ (The warrior movie review): మాస్ తో పాటు ప్రేమకథా చిత్రాల్లో ఒదిగిపోయే హీరోలు తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో రామ్ ఒకరు. పోలీస్ కథాంశంతో రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ది వారియర్. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే...
రామ్, కృతిశెట్టి
The warrior movie review: రామ్ నటించిన తాజా చిత్రం ది వారియర్. పాన్ ఇండియన్ కల్చర్‌తో సినిమా ఇండస్ట్రీల మధ్య భాషాపరమైన హద్దులు తొలగిపోయాయి. ఇతర భాషల్లో తమ మార్కెట్‌ను పెంచుకునేందుకు టాలీవుడ్ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఆలోచనతో రామ్ నటించిన చిత్రం ది వారియర్.
కెరీర్‌లో తొలిసారి ఖాకీ కథలో రామ్ కనిపించిన సినిమా ఇది. పందెంకోడి, అవారా లాంటి మాస్ ఎంటర్‌టైనర్స్‌తో కోలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న లింగుస్వామి ది వారియర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రంలో ఉప్పెన భామ కృతిశెట్టి కథానాయికగా నటించింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో కోలీవుడ్ అగ్ర దర్శకులు భాగం కావడం, పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల్లో ది వారియర్ పట్ల ఆసక్తి ఏర్పడింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన సక్సెస్ లేని రామ్ మూడేళ్ల తర్వాత ఈ సినిమా విజయాన్ని అందుకున్నాడా లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
The warrior movie review: డాక్టర్ పోలీస్ గా మారితే...
సత్య(రామ్) ఓ డాక్టర్. మెడిసిన్ లో టాపర్. కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉద్యోగంలో చేరతాడు. రోడ్డుపై కొనప్రాణాలతో ఉన్న ఓ వ్యక్తిని కాపాడి వైద్య సహాయం అందిస్తాడు. కానీ అతడిని గురు(ఆది పినిశెట్టి) మనుషులు చంపేస్తారు. గురుపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు సత్య. బెదిరింపులకు గురిచేసి కంప్లైంట్ ను వాపస్ తీసుకునేలా చేస్తారు. అయినా పట్టువదలకుండా గురు నేరాలను ఎదురిస్తాడు సత్య.
దాంతో సత్యపై కోపం పెంచుకున్న గురు అతడిపై దాడిచేస్తాడు. ఆ ప్రమాదం నుండి మెడికల్ కాలేజీ డీన్ రాబర్ట్ సహాయంతో ప్రాణాలతో బయటపడతాడు సత్య. గురుపై ప్రతీకారం తీర్చుకునేందుకు రెండేళ్ల తర్వాత కర్నూల్ టౌన్‌కు డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ ఫోలీస్ గా వస్తాడు సత్య. డాక్టర్ గా చేయలేని పనిని పోలీస్ గా సత్య ఎలా చేశాడు? గురు నేరాలకు చెక్ పెట్టగలిగాడా? ఈ పోరాటంలో సత్య ప్రియురాలు మహాలక్ష్మికి ఎలాంటి ఆపద ఎదురైంది? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
తొలిసారి పోలీస్ పాత్రలో..
సినిమాలో ఓ సందర్భంలో డాక్టర్ పోలీస్ కావడం కొత్తగా ఉంది అంటూ ఆది పినిశెట్టి తన అనుచరులతో డైలాగ్ చెబుతాడు. లింగుసామి కూడా అదే అనుకొని ఈ కథను రాసుకున్నట్లుగా అనిపించింది. రియల్ లైఫ్ లో మెడిసిన్ చేసి సివిల్ సర్వీస్ ఎంపికైన పలువురి జీవితాల నుండి స్ఫూర్తి పొందుతూ కమర్షియల్ యాక్షన్ అంశాలతో సినిమాను తెరకెక్కించారు.
పోలీస్ కథల్లో హీరోయిజాన్ని పండించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. లిమిట్స్, రూల్స్ ఏవీ ఉండవు కాబట్టే ఒక్క సారైన పోలీస్ పాత్రలను చేయాలని హీరోలు ఎదురుచూస్తుంటారు. రామ్ కూడా అదే ఆలోచించి ది వారియర్ సినిమాను అంగీకరించాడు కావచ్చు. కథలో కొత్తదనం గురించి ఏ మాత్రం ఆలోచించనట్లుగా అనిపించింది.
హీరో, విలన్ ఫైట్..
డాక్టర్ గా రామ్ క్యారెక్టర్‌ను స్టైలిష్ గా పరిచయం చేశాడు. హీరో పాత్రకు నడిపిస్తూనే మరోవైపు కర్నూల్ లో ఎదురులేని రౌడీగా గురు ఎలా మారాడో చూపించారు. ఆ తర్వాత గురు చేసే అన్యాయాల్ని ఎదురించడానికి రామ్ ప్రయత్నాలు చేసి విఫలమయ్యే సన్నివేశాలను ఫస్ట్ హాఫ్ లో ఆవిష్కరించారు దర్శకుడు.. కొనప్రాణాలతో పారిపోయిన సత్య కర్నూల్ టౌన్ కు పోలీస్ గా వచ్చే మలుపు ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత గురు నేరాలను అడ్డుకోవడానికి సత్య ఎలాంటి ప్లాన్స్ వేశాడు? గురు, సత్య ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో సెకండ్ హాఫ్ సాగుతుంది.
రొటీన్ దారిలో..
పోలీస్ కథలతో తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాలొచ్చాయి. కొందరు ఈ కథలతో కొత్తదనం పడించడానికి ప్రయత్నిస్తే మరికొందరు మాత్రం టెంప్లేట్ స్టోరీస్ తో మాస్ కమర్షియల్ పంథాలో సినిమాలు చేశారు. లింగుసామి రెండో దారిని అనుసరించాడు. రొటీన్ కథతో ఈసినిమాను తెరకెక్కించాడు.
ది వారియర్ చూస్తుంటే పోలీస్ కథలతో ఇదివరకు వచ్చిన సింగం, క్రాక్ తో పాటు ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. ఏ సీన్ లో కొత్తదనం కనిపించదు. పవర్ ఫుల్ విలన్...అతడిని ఎదురించే పోలీస్..వారి ఫైట్ తో పాటు సమాంతరంగా ఓ లవ్ ట్రాక్ రొటీన్ ఫార్మెట్ ను ఫాలో అయ్యాడు లింగుసామి.
రామ్ ఇదివరకు పోలీస్ పాత్రలు చేయలేదు కాబట్టి ది వారియర్ కథను కొత్తగా ఫీలై ఉండొచ్చు. కానీ ప్రేక్షకులకు మాత్రం ఆ అనుభూతి కలగదు. కథలో కొత్తదనం లేకపోయినా దానిని చెప్పే విధానంలోనైనా లింగుసామి డిఫరెంట్ గా అడుగులు వేయలేదు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ ఇదివరకే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది.
రామ్ నటన హైలైట్
పోలీస్ డ్రెస్ లో ఫుల్ ఎనర్జీతో రామ్ నటించాడు. డాక్టర్ గా, ఐపీఎస్ ఆఫీసర్ గా డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో చక్కటి వేరియేషన్ చూపించాడు. సినిమా మొత్తం స్టైలిష్ గా కనిపించాడు. విజిల్ మహాలక్ష్మిగా పాటల్లో గ్లామర్ తళుకులతో ఆకట్టుకున్నది కృతిశెట్టి. ననటించడానికి ఆమెకు పెద్దగా అవకాశం రాలేదు. గురుగా విలన్ పాత్రలో ఆది పినిశెట్టి అదరగొట్టాడు. తన హావభావాలు, డైలాగ్ డెలివరీతోనే విలనిజాన్ని పండించాడు. హీరోకు ధీటుగా అతడి క్యారెక్టర్ ను దర్శకుడు పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాడు. నదియా, శరణ్య, జయప్రకాష్, అక్షరగౌడ పాత్రలు రొటీన్ గా సాగాయి.
బుల్లెట్ సాంగ్ బాగుంది...
దేవిశ్రీప్రసాద్ బాణీల్లో బుల్లెట్, విజిల్ సాంగ్ థియేటర్ లో మాస్ ప్రేక్షకుల్ని అలరించాయి. మెలోడీ సాంగ్ కూడా బాగుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా తెరకెక్కించే క్రమంలో ఇద్దరికీ న్యాయం చేయలేకపోయినా భావన కలుగుతుంది. చివరలో ది వారియర్ కు సీక్వెల్ నురూపొందించబోతున్నట్లు ప్రకటించారు.
ది వారియర్.. రెగ్యులర్ స్టోరీ…
కొత్తదనం వాసనలు అసలే లేని రొటీన్ పోలీస్ డ్రామా గా ది వారియర్ సినిమా రూపొందింది. తెలుగులోనే కాదు తమిళంలో ఈ పాయింట్ తో లెక్కకుమించి సినిమాలొచ్చాయి. మాస్ ప్రేక్షకులతో పాటు రామ్ అభిమానులను మాత్రమే మెప్పించే అవకాశం ఉంది.
రేటింగ్ :2/5
టాపిక్