RGV on HanuMan: హనుమాన్ సినిమా గురించి ట్వీట్ చేసిన రామ్‍గోపాల్ వర్మ
12 January 2024, 15:16 IST
- Ram Gopal Varma on HanuMan: హనుమాన్ సినిమాపై అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ తరుణంలో ఈ చిత్రం గురించి ప్రముఖ దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
రామ గోపాల్ వర్మ - హనుమాన్ పోస్టర్
Ram Gopal Varma on HanuMan: ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హీరో చిత్రం హనుమాన్ అద్భుతమైన టాక్ తెచ్చుకుంటోంది. శుక్రవారం (జనవరి 12) విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. హనుమాన్ సినిమా బ్లాక్‍బాస్టర్ పక్కా అనే చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. గురువారమే ప్రీమియర్స్ మొదలుకాగా.. ఆరంభం నుంచే ఈ మూవీకి సూపర్ టాక్ వచ్చింది. దీంతో హనుమాన్ మంచి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో ఈ మూవీ గురించి ప్రముఖ దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జాకు అభినందనలు తెలుపుతూ రామ్‍గోపాల్ వర్మ నేడు ట్వీట్ చేశారు. “అందరి నుంచి బ్లాక్‍బాస్టర్ తెచ్చుకుంటున్న సందర్భంలో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాకు కంగ్రాచులేషన్స్. జై హను-మాన్” అని ఆర్‌జీవీ రాసుకొచ్చారు. చాలా అరుదుగా వేరే చిత్రాల గురించి ఆర్జీవీ ట్వీట్ చేస్తుంటారు. అందులోనూ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించిన హను-మాన్ గురించి ఆయన స్పందించడం ఆసక్తికరంగా మారింది. గతంలో రామాయణం విషయంపై ఆయన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, తాను ఈ చిత్రం ఇంకా చూశానా లేదా అన్నది మాత్రం ఆయన ట్వీట్‍లో పేర్కొనలేదు.
గత నెల యానిమల్ సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తూ అనేక ట్వీట్లు చేశారు రామ్‍గోపాల్ వర్మ. యానిమల్ మూవీపై ఆయన రాసిన రివ్యూపై చర్చోపచర్చలు కూడా జరిగాయి.
సాయి ధరమ్ తేజ్ సహా మరికొందరు టాలీవుడ్‍కు చెందిన కొందరు సెలెబ్రిటీలు కూడా హనుమాన్ మూవీ గురించి ట్వీట్స్ చేశారు.
హనుమాన్‍కు సూపర్ రెస్పాన్స్
హనుమాన్ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీలో కూడా పాన్ వరల్డ్ రేంజ్‍లో రిలీజ్ అయింది. ప్రతీ చోట ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ ఈ మూవీకి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. హనుమంతుడు ఆధారంగా సూపర్ హీరో సినిమా చేయడం, అద్భుతంగా తెరకెక్కించడంపై దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలో హనుమంతుడిని చూపించిన విధానం, పీఎఫ్ఎక్స్, సూపర్ హీరో ఎలిమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తేజ సజ్జా యాక్టింగ్‍కు కూడా అందరూ ఫిదా అవుతున్నారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సహా అన్ని అంశాల్లో హనుమాన్‍కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‍లో ఈ స్థాయిలో వీఎఫ్‍ఎక్స్ ఔట్‍పుట్ ఇవ్వడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
హనుమంతుడి నుంచి ఉద్భవించిన ఓ మణి వల్ల అతీత శక్తులు పొందే హనుమంతు (తేజ సజ్జా).. దాన్ని సొంతం చేసుకునేందుకు వచ్చే విలన్‍ను ఎలా ఎదుర్కన్నాడు.. తన ప్రాంతాన్ని ఎలా కాపాడుకున్నాడన్నదే హనుమాన్ మూవీ ప్రధాన కథగా ఉంది.
హనుమాన్ మూవీలో అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శీను, వెన్నెల కిశోర్, సత్య కీలకపాత్రలు పోషించారు. హనుమాన్ సినిమాకు సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని కూాడా ప్రకటించారు. దీన్ని 2025లో తీసుకురానున్నట్టు కూడా మేకర్స్ వెల్లడించారు.