Ram Charan Birthday Special: రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ - మెగా వారసుడు టూ గ్లోబల్ స్టార్
27 March 2023, 10:36 IST
Ram Charan Birthday Special: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు రామ్‌చరణ్. జేమ్స్ కామెరూన్ నుంచి ఆనంద్ మహీంద్రా వరకు ఎంతో మంది ప్రముఖులు అతడు అభిమానులుగా మారిపోయారు. రామ్‌చరణ్ సాధించిన విజయాల వెనుక ఉన్న కారణాలు ఇవే
చిరంజీవి, రామ్‌చరణ్
Ram Charan Birthday Special: ఒకప్పుడు చిరంజీవి (Chiranjeevi) తనయుడిగానే రామ్‌చరణ్ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు చరణ్ ఓ గ్లోబల్ స్టార్. వరల్డ్ వైడ్‌గా అతడి పేరు తెలియని సినీ అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుంచి వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వరకు ఎంతో మంది ప్రముఖులు రామ్‌చరణ్ అభిమానులుగా మారిపోయారు.
టాలీవుడ్ హీరోగా కెరీర్‌గా మొదలుపెట్టిన రామ్‌చరణ్...ఇప్పుడు హాలీవుడ్‌లో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. హాలీవుడ్ సిల్వర్‌స్క్రీన్‌పై రామ్‌చరణ్ మెరిసే క్షణాలు తొందరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్కార్ వేడుకలో మెరిసిన తెలుగు స్టార్స్‌లో ఒకరిగా చరిత్రను సృష్టించారు.
బాలీవుడ్ హీరోలు సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్ సైతం రామ్‌చరణ్ తమకు అత్యంత ఆప్తుడిగా ఎన్నోసార్లు పేర్కొన్నారు. ఇవన్నీ చిరంజీవి వారసుడిగా రామ్‌చరణ్ సాధించిన ఘనతలు కాదు. తన స్వయంకృషి, వ్యక్తిత్వం, అసమాన నటనతో రామ్‌చరణ్ సాధించిన విజయాలుగా చెప్పవచ్చు.
నటనకే పనికారాడన్న స్టేజ్ నుంచి...
చిరుత సినిమాతో 2007లో హీరోగా టాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు రామ్‌చరణ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్‌చరణ్ నటన, లుక్స్‌పై చాలా విమర్శలొచ్చాయి. చిరంజీవి గ్రేస్, యాక్టింగ్ టాలెంట్ రామ్‌చరణ్‌కు రాలేదంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు.
హీరోగా నిలదొక్కుకోవడం కష్టమేనని అన్నారు. కానీ ఆ విమర్శల్ని పాజిటివ్‌గా తీసుకుంటూ నటుడిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆస్కార్ స్థాయికి చేరుకున్నాడు రామ్‌చరణ్. తనను విమర్శించిన వారితోనే జేజేలు కొట్టించుకునే స్థాయికి ఎదిగాడు.
మగధరీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత రంగస్థలంతో పరిపూర్ణ నటుడిగా పేరుతెచ్చుకున్నారు రామ్‌చరణ్. చెవిటి యువకుడి పాత్రలో సహజ నటనతో విమర్శకుల్ని మెప్పించాడు.
ఆర్ఆర్ఆర్ చరణ్ కెరీర్‌లో ఆణిముత్యంలా నిలిచిపోయింది. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తపించే పోరాట యోధుడి పాత్రలో అజరామర నటనను కనబరిచి వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్నాడు.
అజాత శత్రువు
తెలుగు సినీ పరిశ్రమలో రామ్‌చరణ్‌కు అజాతశత్రువుగా చెబుతుంటారు. సీనియర్ల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో కలుపుగోలుగా ఉంటాడు. వివాదాలకు ఆది నుంచి చరణ్ దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో చరణ్‌పై ఇక్క కాంట్రవర్సీ కూడా రాలేదు. ఎన్ని సక్సెస్‌లు వచ్చినా చరణ్ వ్యక్తిత్వంలో కొంచెం కూడా మార్పు రాలేదని సన్నిహితులు చెబుతుంటారు. స్నేహానికి ఎంతో విలువనిస్తుంటారు.
పాన్ ఇండియన్ హీరో...
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత చరణ్‌తో సినిమా చేయడానికి బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు క్యూ కడుతోన్నాయి. ప్రస్తుతం శంకర్‌తో గేమ్‌ఛేంజర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు చరణ్. అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమాను అంగీకరించాడు.