Pragathi Second Marriage: తన రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి రియాక్షన్ ఇదీ
30 October 2023, 10:58 IST
- Pragathi Second Marriage: తన రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి స్పందించింది. గత రెండు రోజులుగా న్యూస్ వెబ్‌సైట్లలో వస్తున్న ఈ వార్తలను ఆమె ఖండించింది.
నటి ప్రగతి
Pragathi Second Marriage: టాలీవుడ్ లోని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతోందని, ఓ నిర్మాతను ఆమె పెళ్లాడబోతున్నట్లు ఓ ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ ఓ వార్త రాసింది. అయితే దీనిపై ప్రగతి చాలా ఘాటుగా రియాక్టయింది. ఏం ఆధారాలు ఉన్నాయని ఈ వార్త రాశారు? అంత పెద్ద పత్రిక ఇలాంటి వార్తలు రాయడమేంటని ఆమె ప్రశ్నించింది.
తన రెండో పెళ్లి వార్తలను ప్రగతి ఖండించింది. అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. తాను కేవలం ఓ నటి అన్న కారణంతో ఏది పడితే అది రాసేస్తారా అంటూ సదరు పత్రికపై మండిపడింది. తన రెండో పెళ్లి పుకార్లపై స్పందిస్తూ.. ప్రగతి ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో ఈ పుకార్లను వ్యాపింపజేసిన పత్రికపై ఆమె విరుచుకుపడింది.
మీకు కనీస బాధ్యత లేకపోతే ఎలా? జర్నలిజం విలువలు అంటూ ఉంటాయి కదా.. అవి లేకపోతే ఎలా? ఈ వార్త చూసి నాకు చాలా బాధ కలిగింది. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇలాంటి వార్తలు రాయండి.. లేదంటే రాయొద్దు. ఇలాంటి తప్పులు రిపీట్ చేయొద్దు. కాస్త బాధ్యతగా వ్యవహరించండి అంటూ ప్రగతి ఈ పుకార్లపై చాలా ఘాటు రిప్లై ఇచ్చింది.
ఒకరి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకొని.. ఏది పడితే అది రాయడానికి మీకు ఏం హక్కుందంటూ ప్రశ్నించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా.. ఎవడో కలగన్నాడా.. మీదాంట్లో ఎవరైనా కలగని రాశారా అంటూ ప్రగతి తీవ్రంగా మండిపడింది. మీ పెద్ద ఆర్గనైజేషన్ లో ఎంతో చదుకున్నవాళ్లు ఉంటారు.. వాళ్లు బాధ్యతగా ప్రవర్తిస్తే బాగుంటుందని ఆమె చెప్పింది.
తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన 47 ఏళ్ల ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు రెండు రోజులుగా పలు వెబ్ సైట్లు వార్తలు రాశాయి. ప్రస్తుతం ప్రగతి.. డబుల్ ఇస్మార్ట్ తోపాటు పలు ఇతర సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్ లోని టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి ఒకరు.