Krishnam Raju: ప్రభాస్ పెళ్లి చూడాలన్న కృష్ణంరాజు కల తీరలేదు
11 September 2022, 9:13 IST
Krishnam Raju: ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ గతంలో పలు సినీ వేడుకల్లో కృష్ణంరాజు చెప్పారు. కానీ ఆ కల తీరకుండానే ఆయన కన్నుమూశారు.
ప్రభాస్, కృష్ణంరాజు
Krishnam Raju: తెలుగు సినీ పరిశ్రమలో స్వయంకృషితో హీరోగా ఎదిగాడు కృష్ణంరాజు ఘనమైన కుటుంబవారసత్వం ఉన్నా నటుడిగా రాణించాలనే తపన కారణంగా ఎన్నో అవమానాల్ని దాటుకొని ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, రాజకీయ వేత్తగా అద్భుతమైన విజయాల్ని అందుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో కృష్ణంరాజు మొదటి భార్య కన్నుమూత
కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి 1996లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. మద్రాస్ నుంచి కంచికి కారులో వెళుతుండగా యాక్సిడెంట్ కావడంతో ఆమె మృతిచెందారు. కుటుంబసభ్యుల బలవంతంతో బంధువుల అమ్మాయి శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు కృష్ణంరాజు. మొదటిభార్యకు పిల్లలు లేకపోవడంతో ప్రగతి అనే అమ్మాయిని పెంచుకున్నారు.
సెట్స్ లో రాజసం
స్వతహాగా కృష్ణంరాజు ఫ్యామిలీకి ఘనమైన పేరుప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఉండటంతో అతడి వ్యక్తిగత జీవితం మొత్తం ఎలాంటి సాధకబాధకాలు లేకుండా గడించింది. సెట్స్ లో ఆయన రాజసం కనిపించేది. కానీ ఎప్పుడూ తన ఖర్చులను నిర్మాతలపై రుద్దలేదు. తానే భరించేవాడు. తన ఖర్చులన్నింటిని రెమ్యునరేషన్ లో కట్ చేయమని నిర్మాతలకు చెప్పేవాడు.
కృష్ణంరాజు సినిమాకు కమల్ హాసన్ అసిస్టెంట్
కృష్ణంరాజు నటించిన ఇంటిదొంగలు సినిమాకు కమల్ హాసన్ డ్యాన్స్ అసిస్టెంట్ గా పనిచేశాడు. సినిమా చిత్రీకరణ సమయంలో కమల్ ప్రతిభను చూసి ఎప్పటికైనా పెద్దవాడు అవుతాడని కృష్ణంరాజు అతడితో చెప్పాడు. ఆ మాట నిజమైంది.
గోపీకృష్ణ మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థ
నటుడిగా నిలదొక్కుకుంటున్న తరుణంలో గోపీకృష్ణమూవీస్ పేరుతో స్వీయ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు కృష్ణంరాజు. ఈ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో కృష్ణవేణి సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఈ బ్యానర్ పై భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు మొదలుకొని ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ వరకు పలు సినిమాల్ని నిర్మించారు కృష్ణంరాజు.
ప్రభాస్ పెళ్లి చూడాలన్నది కోరిక
కృష్ణంరాజు నటవారసుడిగా ఈశ్వర్ సినిమాతో 2002 లో ప్రభాస్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణరాజు కుమారుడు ప్రభాస్. అనతికాలంలోనే పెదనాన్న పేరును ప్రభాస్ నిలబెట్టాడు. ప్రభాస్ పెళ్లి చూడాలన్నది తన కోరిక అని కృష్ణంరాజు పలు మార్లు పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదు. అలాగే ప్రభాస్ తో భక్త కన్నప్ప సినిమాను రీమేక్ చేయాలన్నది తన కోరిక అని కృష్ణంరాజు పలు మార్లు చెప్పారు. కానీ ఆ కోరిక కూడా తీరకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు.