Anasuya Quits TV Shows: బుల్లితెరను వదిలి అనసూయ పెద్ద తప్పు చేసిందా? సినిమా ఆఫర్ల సంగతేంటి?
06 March 2023, 7:21 IST
- Anasuya Quits TV Shows: ప్రముఖ బుల్లితెర నటి అనసూయ భరద్వాజ్ సినిమాలను వదిలిపెట్టడం ఆమెకు తీరని నష్టాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. పుష్ప-2 మినహా ఆమె చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు.
అనసూయ భరద్వాజ్
Anasuya Quits TV Shows: బుల్లి తెర యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన చురుకైన చూపులతో, సరదా సంభాషణలతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో బుల్లి తెరకు దూరమైన సంగతి తెలిసిందే. ఫుల్ లెంగ్త్ సినిమాలపైనే దృష్టిపెట్టిన ఈ అమ్మడు వెండితెరపై గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత యాంకర్, నటిగా మల్టీ టాలెంట్‌ను కలిగి ఉన్న అనసూయ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు బాగానే మూల్యం చెల్లించుకునేలా చేస్తున్నాయి. బుల్లి తెరను వీడి సినిమాలపైనే దృష్టి పెట్టడం వల్ల అనసూయకు డబ్బు పరంగా బాగానే నష్టం కలిగినట్లు సమాచారం.
జబర్దస్త్ యాంకర్‌గా వైదొలిగినప్పటి నుంచి అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టాలీవుడ్‌లో తను చాలా బిజీ ఆర్టిస్టుగా మారుతుందని కలలు కన్నది. అయితే అమ్మడు అనుకున్నది ఒకటయితే అయింది మరోకటి. రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ కావడంతో ఆమె వద్దకు కొన్ని ఆఫర్లు వచ్చాయి. అయితే ఇవి పెద్దగా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా గతేడాది రవితేజ నటించిన ఖిలాడి చిత్రంలో ఆమె పాత్రను చూసిన ఆడియెన్స్ నవ్వుకున్నారు. అలాగే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ అయిన థ్యాంక్యూ మూవీ కూడా పెద్దగా అలరించలేదు. ఇంక పెద్ద సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినప్పటికీ అవి అనసూయకు గుర్తింపు తీసుకురాలేదు.
ప్రస్తుతం అనసూయ ఎలాంటి టీవీ షోలను చేయట్లేదు. అలాగే పుష్ప-2 మినహా పెద్ద సినిమాలేవి ఆమె చేతిలో లేవు. కాబట్టి ఇలాంటి సమయంలో అనసూయ తను ఆశించిన విధంగా కెరీర్‌లో దూసుకెళ్లాలంటే ఆమెకు అర్జెంటుగా రెండు, మూడు హిట్లు పడాలి. అలాగే పెద్ద సినిమాల్లో తనకు గుర్తుండిపోయే పాత్ర చేయాలి. నటిగా ఇలాగే నిలదొక్కుకుని ముందుకు వెళ్లాలంటే మంచి బ్రేక్ దొరకాలి. దీన్ని బట్టి చూస్తుంటే బుల్లితెరను వదిలిపెట్టడం అనసూయకు తీరని నష్టాన్ని కలిగిస్తుందని తెలుస్తోంది.