Nagarjuna - Pooja Hegde: నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న పూజాహెగ్డే
08 January 2023, 10:00 IST
Nagarjuna - Pooja Hegde: గతంలో అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్‌తో కలిసి సినిమాలు చేసింది పూజాహెగ్డే. తాజాగా నాగార్జున కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నది.
పూజాహెగ్డే
Nagarjuna - Pooja Hegde: అక్కినేని హీరోల్లో నాగచైతన్యతో ఒక లైలా కోసం, అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు చేసింది పూజాహెగ్డే. తాజాగా నాగార్జునతో కలిసి నటించబోతున్నది. అయితే సినిమాలో కాదు. నాగార్జున, పూజా హెగ్డే కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో నటించనున్నారు.
ఈ యాడ్ షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో జరిగినట్లు సమాచారం. ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది బంగార్రాజుతో పాటు ది ఘోస్ట్ సినిమాలు చేశారు నాగార్జున. ఇందులో బంగార్రాజు విజయాన్ని అందుకోగా ది ఘోస్ట్ మాత్రం నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం తనయుడు అఖిల్ అక్కినేనితో మల్టీస్టారర్‌తో పాటు ధమాకా రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు నాగార్జున.
మరోవైపు పూజాహెగ్డేకు గత ఏడాది దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో పూర్తిగా చేదు ఫలితాలే ఎదురయ్యాయి. ఆమె నటించిన నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు డిజాస్టర్స్‌గా మిగిలాయి. తెలుగులో ఆచార్య, రాధేశ్యామ్ పూజాహెగ్డేకు పరాజయాల్ని మిగిల్చగా తమిళంలో బీస్ట్, బాలీవుడ్‌లో సర్కస్ సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి.
ప్రస్తుతం మహేష్‌బాబు (Mahesh babu), త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది పూజాహెగ్డే. ఈ జనవరిలోనే మహేష్‌బాబు సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నది పూజాహెగ్డే. సర్కస్ తర్వాత బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌తో (Salman khan) కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా చేస్తోంది పూజాహెగ్డే. 2023లో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.