Pindam TV Premier Date: వణికించే తెలుగు హారర్ మూవీ టీవీలోకి వచ్చేస్తోంది.. ప్రీమియర్ డేట్ ఇదే
19 August 2024, 19:37 IST
- Pindam TV Premier Date: వణికించే హారర్ మూవీ 9 నెలల తర్వాత టీవీ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు టీవీలోనూ రాబోతోంది. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వణికించే తెలుగు హారర్ మూవీ టీవీలోకి వచ్చేస్తోంది.. ప్రీమియర్ డేట్ ఇదే
Pindam TV Premier Date: తెలుగు హారర్ మూవీ పిండం టీవీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన 9 నెలలు, ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఆరు నెలల తర్వాత ఇప్పుడు టీవీలోకి ఈ వణికించే హారర్ మూవీ రాబోతోంది. ఈ సినిమాను వచ్చే ఆదివారం (ఆగస్ట్ 25) టెలికాస్ట్ చేయనున్నట్లు జీ తెలుగు ఛానెల్ వెల్లడించింది.
పిండం టీవీ ప్రీమియర్ డేట్
పిండం మూవీ టీవీ ప్రీమియర్ తేదీ గురించి సోమవారం (ఆగస్ట్ 19) జీ తెలుగు ఛానెల్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. "మిస్టరీ, సస్పెన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉండండి. పిండం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మీ జీ తెలుగులో" అనే క్యాప్షన్ తో పిండం మూవీ టీవీ ప్రీమియర్ విషయాన్ని వెల్లడించింది.
పిండం ఓ హారర్ మూవీ. గతేడాది డిసెంబర్ 15న థియేటర్లలోకి వచ్చింది. అప్పుడు థియేటర్లలో చూడని వాళ్లకు ఇప్పుడు రెండు ఓటీటీల్లో ఈ సినిమా చూసే అవకాశం వచ్చింది. ఆహాతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ మూవీలో శ్రీరామ్ తోపాటు ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్, రవి వర్మలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. మిక్స్‌డ్ టాక్‌తో రివ్యూలు వచ్చాయి.
పిండం మూవీ ఎలా ఉందంటే?
పాడుబడిన పాత ఇంట్లోకి హీరో ఫ్యామిలీ రావడం, అందులో ఆత్మలు ఉండటం, వాటి నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం అన్నది హారర్ సినిమాల్లో ఎవర్‌గ్రీన్ ఫార్ములా. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ ఫార్ములాలో వందలాది సినిమాలొచ్చాయి.
అయినా జానర్‌కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ ఫార్ములా తో దర్శకులు కథలు రాస్తూనే ఉన్నారు. పిండం ఆ కోవకు చెందిన సినిమానే. కామెడీ, హీరోయిజం లాంటి అంశాలతో మిక్స్ చేయకుండా ప్యూర్ హారర్ మూవీగా పిండం సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కథ రొటీన్ అయినా సౌండ్స్, హారర్ ఎలిమెంట్స్‌తో భయపెట్టాడు.
తన అనుభవంతో ఆంథోనీ పాత్రలో శ్రీరామ్ ఒదిగిపోయాడు. ఆత్మల బారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగా అతడి నటన మెప్పిస్తుంది. తాంత్రిక విద్యలు తెలిసిన మహిళగా ఈశ్వరీరావు చాలా వరకు ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నటించిన విధానం బాగుంది.ఆమె క్యారెక్టర్‌ను డైరెక్టర్ డిజైన్ చేసుకున్న తీరు మెప్పిస్తుంది. ఖుషి రవి నటన ఆకట్టుకుంటుంది.శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ నిడివి తక్కువే.