Bro Pre Release Event: బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఫిక్స్ - ఈ సారి పవన్ పొలిటికల్ స్పీచ్‌లు లేనట్లే?
19 July 2023, 11:45 IST
Bro Pre Release Event: పవన్ కళ్యాణ్ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్సయింది. ఈ వేడుక ఎప్పుడు, ఎక్కడ జరుగనుందంటే...
పవన్ కళ్యాణ్ బ్రో మూవీ
Bro Pre Release Event: పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్‌తేజ్(Sai Dharam Tej) హీరోలుగా నటిస్తోన్న బ్రో మూవీ జూలై 28న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ తో పాటు వేదిక ఖరారైనట్లు సమాచారం. జూలై 25న హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలిసింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నాడు.
రాజకీయాల ప్రస్తావన ఉంటుందా?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో బిజీగా ఉన్నాడు. అతడి పొలిటికల్ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
కేవలం సినిమాల గురించే మాట్లాడుతాడా? పొలిటికల్ అంశాల ప్రస్తావన ఉంటుందా? అన్నది సినీ, రాజకీయ వర్గాల్లో క్యూరియాసిటీని కలిగిస్తోంది. భీమ్లానాయక్, వకీల్‌సాబ్ సినిమాల వేడుకల్లో రాజకీయ అంశాల గురించి పవన్ ప్రస్తావించడంతో ఏపీలో ఆయా సినిమాల డిస్ట్రిబ్యూటర్స్ తీవ్రంగా నష్టపోయారు. గత సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ సారి కేవలం బ్రో సినిమా గురించే పవన్ మాట్లాడే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
సెకండ్ ఛాన్స్ ఇస్తే...
అర్ధాంతరంగా కన్నుమూసిన ఓ వ్యక్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జరిగిందనే కథాంశంతో బ్రో మూవీ తెరకెక్కుతోంది. ఇందులో టైమ్ అనే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. మార్కాండేయులు అలియాస్ మార్క్ అనే క్యారెక్టర్‌లో సాయిధరమ్‌తేజ్ కనిపించబోతున్నాడు. ఈ మామ అల్లుళ్ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం.
బ్రో మూవీకి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లేతో పాటు సంభాషణలను అందిస్తోన్నారు. తమిళంలో విజయవంతమైన వినోదయ సిత్తం ఆధారంగా బ్రో మూవీ తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తోన్నాడు. ఇందులో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు.