Oscar host on RRR: రాజమౌళి ప్రమోషన్ అంతా దండగేనా.. ఆర్ఆర్ఆర్‌ను బాలీవుడ్ మూవీ అన్న హోస్ట్ కిమ్మెల్
13 March 2023, 17:41 IST
- Oscar host on RRR: రాజమౌళి ప్రమోషన్ అంతా దండగేనా? ఆర్ఆర్ఆర్‌ను బాలీవుడ్ మూవీ అని ఆస్కార్స్ హోస్ట్ కిమ్మెల్ అనడం చాలా మందిని ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురి చేసింది.
ఆస్కార్స్ వేదికపై చంద్రబోస్, కీరవాణి
Oscar host on RRR: ఇండియాలో తీసిన ప్రతి సినిమా బాలీవుడ్‌దేనా? ఆస్కార్స్ 2023 హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ ప్రకారం అలాగే అనుకోవాలేమో. తెలుగు వాళ్లంతా గర్వించదగిన ఈ సినిమాను ప్రపంచస్థాయిలో ప్రమోట్ చేయడానికి ఆ మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చేయని ప్రయత్నం లేదు. కానీ చివరికి ప్రఖ్యాత ఆస్కార్స్ వేదికపై ఈ సినిమాను బాలీవుడ్ మూవీగా పరిచయం చేశాడు హోస్ట్ జిమ్మీ కిమ్మెల్.
ఇదో తెలుగు సినిమా.. బాలీవుడ్ నుంచి వచ్చింది కాదు అని చెప్పడానికి రాజమౌళి గట్టిగానే ప్రయత్నించాడు. ఎన్నో నెలలుగా అమెరికా, జపాన్ లాంటి దేశాలు తిరిగి ఈ సినిమాను ప్రమోట్ చేశాడు. ప్రతిసారీ ఇదో తెలుగు సినిమా అనే గ్లోబల్ ఆడియెన్స్ కు పరిచయం చేశాడు. ఒక్కసారి కాదు.. ప్రపంచ వేదికలపై మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిసారీ ఈ విషయం చెప్పాడు.
అయినా ఆస్కార్స్ పెద్దలకు ఇవేమీ పట్టలేదు. 95వ ఆస్కార్స్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కిమ్మెల్ సెర్మనీ ప్రారంభానికి ముందు 14 నిమిషాల పాటు మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ గురించి చెబుతూ ఇదొక బాలీవుడ్ సినిమా అని అన్నాడు. ఈసారి ఆస్కార్స్ వేదికపై ఆర్ఆర్ఆర్ మూవీ పాట లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతోందని చెబుతూ కిమ్మెల్ ఈ మూవీని బాలీవుడ్ కు చెందినదిగా చెప్పాడు.
ఇదే అభిమానులకు రుచించడం లేదు. ఇన్నాళ్లూ ఇండియా అంటే బాలీవుడ్ అనే అభిప్రాయమే పశ్చిమ దేశాల్లో ఉండేది. కానీ బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతారాలాంటి సినిమాలు ఇండియాలో బాలీవుడ్ నే తలదన్నేలా ఆడాయి. అక్కడి ప్రేక్షకులకు సౌత్ సినిమాల అసలు రుచేంటో చూపించాయి. భారతీయ అభిమానులు కూడా తెలుగు, కన్నడ, తమిళంలాంటి భాషల సినిమాలను ఆదరిస్తున్న సమయంలో ఆస్కార్స్ లాంటి వేదికపై ఓ తెలుగు సినిమాను బాలీవుడ్ సినిమాగా పరిచయం చేయడం అభిమానులకు రుచించడం లేదు.
జిమ్మీ కిమ్మెల్ ను సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు. అంతటి వేదికపై తెలుగు అన్న పదం వ్యాఖ్యాత నోటి నుంచి వస్తే వినాలని ఆనందపడిన అభిమానుల ఆశ నెరవేరలేదు. ఆ కోపంతోనే సోషల్ మీడియా వేదికగా జిమ్మీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. రాజమౌళి ఎన్నో నెలలుగా చేసిన ప్రమోషన్ చివరికి ఇలా ఫెయిల్ అవడంపై నిరాశ వ్యక్తం చేశారు.