తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi: దాని కంటే ఏ అవార్డు పెద్దది కాదు: చిరంజీవి

Chiranjeevi: దాని కంటే ఏ అవార్డు పెద్దది కాదు: చిరంజీవి

04 February 2024, 16:01 IST

google News
    • Padma Vibhushan Megastar Chiranjeevi: పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. సినిమాలు చేస్తూనే ఉంటానని అభిమానుల్లో సంతోషం పెంచారు.
Chiranjeevi: దాని కంటే ఏ అవార్డు పెద్దది కాదు: చిరంజీవి
Chiranjeevi: దాని కంటే ఏ అవార్డు పెద్దది కాదు: చిరంజీవి

Chiranjeevi: దాని కంటే ఏ అవార్డు పెద్దది కాదు: చిరంజీవి

Padma Vibhushan Chiranjeevi: సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సినీ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరటంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరూకు భారత రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇచ్చింది. దీంతో సినీ ప్రేక్షకులతో పాటు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం నేడు సత్కరించింది. పద్మవిభూషణ్ దక్కించుకున్న చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మిగిలిన పద్మ అవార్డు విజేతలను సన్మానించింది. హైదరాబాద్‍లోని శిల్ప కళా వేదికలో నేడు (ఫిబ్రవరి 4) ఈ కార్యక్రమం జరిగింది.

చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా కొందరు మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. తాను అవార్డుల కోసం కోరుకోనని, ప్రజల గుండెల్లో తనపై ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు పెద్దది కాదని చిరూ అన్నారు.

సినిమాలు.. డ్యాన్స్‌లు చేస్తూనే ఉంటా

మిగిలిన జీవితమంతా సినిమాలు చేస్తానని చిరంజీవి చెప్పారు. “భగవంతుడా నాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వు.. ఆలోచన ఇవ్వు.. నేను అవార్డుల కోసం ఎదురుచూడను. అవార్డులు రావాలని కోరుకోను. వాళ్ల (ప్రజల) గుండెల్లో ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు పెద్దది కాదు. మిగతా జీవితం అంతా సినిమాలు చేస్తూనే ఉంటా.. డ్యాన్సులు ఆడుతూనే ఉంటా.. ఫైట్లు చేస్తూనే ఉంటా.. మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా. ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాను” అని చిరంజీవి అన్నారు.

పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కలిగినంత ఆనందం.. ఇప్పుడు పద్మవిభూషణ్ వచ్చినప్పుడు తనకు కలగలేదని చిరంజీవి అన్నారు. అయితే, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానుల నుంచి వస్తున్న శుభాకాంక్షలు, ప్రశంసలతో తనకు సంతోషం వచ్చిందని చెప్పారు. అవార్డు ఇవ్వని ఉత్సాహం, ప్రోత్సాహం అందరి ప్రశంసల ద్వారా వచ్చిందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ మనసారా ఆశీర్వదిస్తుంటే ఈ జన్మకు చాలని, ఎప్పడో చేసుకున్న పుణ్యఫలం అని అనిపిస్తోందని చిరంజీవి అన్నారు.

డైనమిక్ లీడర్.. రేవంత్ అంటూ..

పద్మ అవార్డుల ప్రకటన వచ్చిన వెంటనే సత్కారం ఏర్పాటు చేయాలని శరవేగంగా నిర్ణయించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసించారు చిరంజీవి. “ప్రప్రథమంగా అవార్డులు ప్రకటించిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి.. వారికి సన్మానం చేయాలని అనే భావం రావడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు మొదటిసారి జరిగింది. దానికి ప్రధానమైన కారణం యువకుడు, డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రులు. మన వాళ్లని మనం గౌరవించుకోకపోతే ఎలా అని ఆయన అన్నారు. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని చిరంజీవి అన్నారు.

నంది అవార్డులకు ప్రజాగాయకుడు దివంగత గద్దర్ పేరు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతునిచ్చారు చిరంజీవి.  ఇది సముచితమైన నిర్ణయమని అన్నారు. 

తన తండ్రి చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా శనివారం మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

సినిమాల విషయానికి వస్తే..

చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమాగా ‘విశ్వంభర’ చేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ మూవీగా భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందనుంది. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2025 సంక్రాంతి సమయంలో జనవరి 10న రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. త్వరలో ఈ చిత్ర షూటింగ్‍లో చిరూ పాల్గొననున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం