Chiranjeevi: 68 ఏళ్ల వయసులో చిరంజీవి భారీ వర్కౌట్స్.. విశ్వంభర కోసం సరికొత్తగా సిద్ధం! వీడియో వైరల్
Chiranjeevi Workouts For Vishwambhara Movie: పద్మవిభూషణ్ చిరంజీవి విశ్వంభర సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. బింబిసార్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీకో చిరంజీవి భారీ వర్కౌట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Chiranjeevi Viswambhara Update: గతేడాది భోళా శంకర్ మూవీతో బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో మంచి సక్సెస్ ట్రాక్ ఎక్కిన చిరంజీవి భోళా శంకర్ మూవీతో మళ్లీ పరాజయం చూశారు. ఇక ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గుడ్ న్యూస్ విన్నారు. ఈ 2024లో చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు ఆయన అభిమానులు తెగ సంబరపడిపోయారు.
పద్మవిభూషణ్ అవార్డ్ ఇచ్చిన జోష్‌లో సినిమాలపై మరింత ఫోకస్ పెట్టారు చిరంజీవి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి సినిమాకు సంబంధించి క్రేజీ విషయంగా మారిన మూవీ విశ్వంభర. కల్యాణ్ రామ్ సూపర్ హిట్ కొట్టిన బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో విడుదల చేసిన పోస్టర్‌తోపాటు ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అంతేకాకుండా ఆ గ్లింప్స్ మూవీపై క్యూరియాసిటీ కలిగేలా చేసింది.
విశ్వంభర కోసం చిరంజీవి ఎన్నడూ లేని విధంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా ఈపాటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. కానీ, చిరంజీవి ఇంకా విశ్వంభర సెట్స్‌లో అడుగుపెట్టలేదు. అయితే తాజాగా ఆయన సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఓ వీడియో ద్వారా చెప్పారు. విశ్వంభర మూవీ కోసం సరికొత్తగా రెడీ అవుతున్నారు. అందుకు గానూ ఎప్పుడు చేయని విధంగా భారీ కసరత్తులు చేస్తున్నారు చిరంజీవి.
దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. అంతేకాకుండా ఆ వీడియో చివరిలో విశ్వంభర కోసం రెడీ అవుతున్నాను అని తెలిపారు. ఆ వీడియోలో భారీ కసరత్తులు చేస్తూ చెమటలు చిందించారు మెగాస్టార్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి 68 ఏళ్లు. 68 ఏళ్ల వయసులోనూ సినిమా కోసం పద్మవిభూషణ్ చిరంజీవి పడే కష్టం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్‌లో వస్తున్న విశ్వంభర మూవీని సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హనుమాన్ పాత్ర కీలకంగా ఉండనుందని ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ మూవీ మూడు లోకాలకు సంబంధించినదిగా గ్లింప్స్‌లో తెలిపారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబుగా కనిపిస్తారని ఓ ప్రచారం నడుస్తోంది. విశ్వంభర మూవీని వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అంటే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విశ్వంభర మూవీతో చిరంజీవి దిగనున్నారు.
కాగా విశ్వంభర మూవీలో సీతారామం, హాయ్ నాన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఓ కీ రోల్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, కొద్ది రోజుల క్రితం ఈ వార్త హైలెట్ అయింది. ఇదిలా ఉంటే చిరంజీవి విశ్వంభర చిత్రం మాత్రమే కాకుండా మరో సినిమా కూడా చేస్తున్నారు. చిరంజీవి తన కూతురు సుశ్మిత కొణిదెల బ్యానర్ అయిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్‌లో మెగాస్టార్ సినిమా చేయనున్నారు. అది మలయాళం సూపర్ హిట్ మూవీ బ్రో డాడీ అని సమాచారం.