Tollywood | ఇష్క్’ సినిమాకు తొలి రెమ్యునరేషన్ అందుకున్నానన్న నిత్యామీనన్
24 February 2022, 23:12 IST
నితిన్, నిత్యామీనన్ జంటగా 2012లో విడుదలైన ‘ఇష్క్’ సినిమా ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ టీమ్ తో కలిసి మరోసారి పనిచేయాలనుందని నితిన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
నితిన్,నిత్యా మీనన్
నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘ఇష్క్’ సినిమా విడుదలై నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం 2012, ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు ముందు నితిన్ నటించిన పన్నెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నితిన్ కెరీర్ ముగిసిపోతుందనుకున్న తరుణంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. హీరోగా తిరిగి నితిన్ ను ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. అనూప్ రూబెన్స్ పాటలు, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. స్వీయ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఇష్క్’ టీమ్ తో మరోసారి పనిచేయాలనుందని హీరో నితిన్ తన మనసులో మాటను బయటపెట్టారు. ‘ఇష్క్’ తన కెరీర్‌లో మెమొరబుల్ సినిమాగా నిలిచిందన్నారు. ‘నటుడిగా ‘ఇష్క్’ నాకు పునర్జన్మను ఇచ్చింది. కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే మంచి సినిమాను దర్శకుడు విక్రమ్ నాకు ఇచ్చారు. సినిమాలో నాది, నిత్యామీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇష్క్ టీమ్‌తో మరో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని నితిన్ తెలిపారు. ‘ఇష్క్’ తెలుగులో తన సెకండ్ మూవీ అని నిత్యామీనన్ తెలిపింది. ఇందులో తాను పాడిన `ప్రియా ప్రియా` పాటను ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని, ఎక్కడకు వెళ్లినా ఈ పాట పాడమని చాలా మంది అడుగుతుంటారని చెప్పింది. సింగర్ గా తెలుగులో మొదటి రెమ్యునరేషన్ ఈ పాట పాడినందుకే తీసుకున్నానని ఆమె పేర్కొన్నది. ఈ సినిమా విడుదలై అప్పుడే పదేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నానని చెప్పింది. దర్శకుడిగా ‘ఇష్క్’ సినిమా తన లైఫ్‌ను మార్చివేసిందని విక్రమ్ కె కుమార్ అన్నారు.