Nithiin 32nd Movie: నితిన్‌ను టెన్షన్ పెట్టిస్తోన్న ఏజెంట్ రిజల్ట్ - కారణం ఇదే
17 May 2023, 14:18 IST
Nithiin 32nd Movie: అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తోన్న ఏజెంట్ డిజాస్టర్‌గా నిలవడంతో నితిన్ టెన్షన్ పడుతోన్నట్లుగా టాలీవుడ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ఏమిటంటే...
నితిన్
Nithiin 32nd Movie: అఖిల్ అక్కినేని ఏజెంట్ డిజాస్టర్‌గా నిలవడంతో హీరో నితిన్ టెన్షన్ పడుతోన్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఏజెంట్ మూవీ ఆరు కోట్లు కూడా కలెక్షన్స్ రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిలాపడింది.
నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. ఏజెంట్ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించాడు. ఈ సినిమా పరాజయానికి కథే ప్రధాన కారణంగా నిలిచింది. ఔట్‌డేటెడ్ స్టోరీ కావడంతో ఏజెంట్‌ను ప్రేక్షకులు తిరస్కరించారు. టెంపర్ తర్వాత రైటర్‌గా వక్కంతం వంశీకి సక్సెస్‌లు లేవు. అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాతో డైరెక్టర్‌గా మారాడు వక్కంతం వంశీ.
ఈ సినిమా కూడా అతడికి విజయాన్ని అందించలేకపోయింది. దర్శకుడిగా ద్వితీయ ప్రయత్నంగా హీరో నితిన్‌తో ఓ మాస్ యాక్షన్ మూవీ చేస్తోన్నాడు వక్కంతం వంశీ. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయినట్లు సమాచారం. ఏజెంట్ హిట్టయితే నితిన్, వక్కంతం వంశీ ప్రాజెక్ట్‌కు ఆ క్రేజ్ ఉపయోగపడేది. కానీ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో ఆ ప్రభావం సినిమాపై పడినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తోన్నాయి.
కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా దర్శకుడికి నితిన్ సూచించినట్లు చెబుతోన్నారు. ఆ మార్పుల కారణంగానే సినిమా షూటింగ్ వాయిదాపడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ విషయంలో నితిన్ పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేనట్లు చెబుతోన్నారు.
కొన్ని రీషూట్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. వక్కంతం వంశీతో పాటు నితిన్‌కు సక్సెస్ కీలకంగా మారడంతోనే చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు చెబుతోన్నారు. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
నితిన్ హీరోగా నటిస్తోన్న 32వ సినిమా ఇది. హరీస్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. నితిన్ స్వీయ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డితో కలిసి సోదరి నిఖితారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తోంది.