Nayanthara: నయనతార స్థాయికి బాలీవుడ్ హీరోయిన్లు ఎప్పటికీ చేరుకోలేరు- కరణ్ జోహార్ పై నయన్ ఫ్యాన్స్ ఫైర్
25 July 2022, 9:00 IST
నయనతార (Nayanthara)ను ఉద్దేశించి కాఫీ విత్ కరణ్ (koffe with karan) ఎపిసోడ్‌లో కరణ్‌జోహార్ (karan johar) చేసిన వ్యాఖ్యలపై ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ షోలో నయన్ గురించి కరణ్ జోహార్ ఏమన్నాడంటే...
సమంత, నయనతార
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌పై నయనతార అభిమానులు సీరియస్ అవుతున్నారు. దక్షిణాది చిత్రసీమపై తనలో ఉన్న అసూయద్వేషాలను మరోసారి కరణ్ బయటపెట్టాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో సమంత ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ షోలో ప్రస్తుతం దక్షిణాదిలో నంబర్‌వన్ హీరోయిన్ ఎవరని మీరు అనుకుంటున్నారు అంటూ సమంతను కరణ్ జోహార్ ప్రశ్నించారు. అతడి ప్రశ్నకు నయనతార అంటూ సమంత సమాధానం చెప్పింది. నంబర్‌వన్ హీరోయిన్ నయనతారతో ఇటీవల ఓ సినిమా చేశానని బదులిచ్చింది. ఆమె సమాధానాన్ని మధ్యలోనే అడ్డుకున్న కరణ్ తన దృష్టిలో నయనతార నంబర్ వన్ కాదంటూ చెప్పాడు. నయన్ తన లిస్ట్‌లోనే లేదంటూ చెప్పాడు. మీరే నెంబర్‌వన్ అని తాను అనుకుంటున్నానని సమంతతో చెప్పాడు.
వీరిద్దరి మధ్య సాగిన చర్చపై నయనతార అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావాలనే నయనతారను కించపరుస్తూ కరణ్ జోహార్ కామెంట్స్ చేశాడంటూ పేర్కొంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు ఎప్పటికీ నయనతార స్థాయికి చేరుకోలేరని ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణాది సినీ పరిశ్రమ కరణ్‌లో ఉన్న జెలసీ ఈ షో ద్వారా మరోసారి బయటపడిందని చెబుతున్నారు. నయనతార సినిమాల్ని బాలీవుడ్ వాళ్లు రీమేక్ చేస్తున్నారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. తమిళంలో నయనతార హీరోయిన్‌గా నటించిన కొలమావు కోకిల సినిమా హిందీలో గుడ్‌లక్ జెర్రీ పేరుతో రీమేక్ ఆవుతోంది. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.