Nanpakal Nerathu Mayakkam Review: నాన్ పకల్ నేరత్తు మయక్కం మూవీ రివ్యూ - మమ్ముట్టి కొత్త ప్రయోగం ఎలా ఉందంటే
25 February 2023, 5:58 IST
Nanpakal Nerathu Mayakkam Review: మమ్ముట్టి హీరోగా జల్లికట్టు ఫేమ్ లిజో జోస్ పెల్లిసెరి దర్శకత్వంలో రూపొందిన సినిమా నాన్ పకల్ నేరత్తు మయక్కం. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా రిలీజైంది
నాన్ పకల్ నేరత్తు మయక్కం
Nanpakal Nerathu Mayakkam Review: కమర్షియల్ ఒరవడికి భిన్నమైన కథల్ని , పాత్రల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి(Mammootty). ప్రయోగాత్మక కథాంశంతో మమ్ముట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన తాజా సినిమా నాన్ పకల్ నేరత్తు మయక్కం.
జల్లికట్టు ఫేమ్ లిజో జోస్ పెల్లిసెరి(Lijo Jose Pellissery) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నెట్‌ఫ్లిక్స్ ద్వారా మలయాళంతో పాటు తెలుగులో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిలాసఫికల్ పాయింట్‌తో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...
జేమ్స్ సుందరంగా మారితే...
జేమ్స్ (మమ్ముట్టి) తన భార్యాపిల్లలతో పాటు బంధువులతో కలిసి వేలంకిని మాత దర్శనానికి వెళతాడు. తిరుగు ప్రయాణంలో తమిళనాడులోని ఓ పల్లెటూరులో బస్ దిగిన జేమ్స్ ఆ ఊరిలోని ఓ ఇంటికి వెళతాడు. తెలుగు వాడైన జేమ్స్ తమిళంలో మాట్లాడటం మొదలుపెడతాడు. అంతే కాకుండా ఆ ఊరిలోని వారందరిని పేర్లు పెట్టి పలకరిస్తుంటాడు. ఇదే తన ఊరంటూ చెబుతాడు.
రెండేళ్ల క్రితం తప్పిపోయిన ఆ ఊరి వాడైన సుందరం అనే వ్యక్తిలా బిహేవ్ చేయడం మొదలుపెడతాడు. జేమ్స్‌లో వచ్చిన మార్పుకు కారణమేమిటన్నది అతడి భార్యాపిల్లలతో పాటు ఆ ఊరివాళ్లకు అంతుపట్టదు. అతడిని తమతో తీసుకెళ్లడానికి బంధువులు ఎన్ని ప్రయత్నాలు చేసినా జేమ్స్ ఒప్పుకోడు.
అసలు జేమ్స్ అలా మారిపోవడానికి కారణం ఏమిటి? సుందరంగా మారిపోయిన జేమ్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? తన గతాన్ని జేమ్స్ తెలుసుకొని భార్యాపిల్లతో వెళ్లాడా? సుందరంగా అక్కడే స్థిరపడ్డాడా? అన్నదే(Nanpakal Nerathu Mayakkam Review) మిగిలిన కథ.
మధ్యాహ్నం నిద్ర
నాన్‌పకల్ నేరత్తు మయక్కం కథ ఇది అని చెప్పడం కష్టమే. ప్రపంచమే ఓ రంగస్థలం. అందులో మనుషులంతా పాత్ర ధారులే. ఇక్కడ ఎవరి జీవితం వాళ్లదే. మరొకరి పాత్రలో జీవించాలని అనుకుంటే సమాజం అంగీకరించదనే ఫిలాసఫికల్ పాయింట్‌ను టచ్ చేస్తూ దర్శకుడు లిజో జోస్ పెల్లిసెరి ఈ సినిమాను రూపొందించారు.
ఓ ప్రయాణంలో మధ్యాహ్నం పూట తీసిన చిన్న పాటి కునుకు జేమ్స్ జీవితాన్ని ఎలా అల్ల కల్లోలం చేసిందనేది ఎమోషనల్ యాంగిల్‌లో ఈ సినిమాలో చూపించారు. కుల, మత, భాషాపరమైన భేధాలను విస్మరిస్తే మనుషులంతా ఒక్కటే అని ఈ సినిమాలో(Nanpakal Nerathu Mayakkam Review) చూపించారు.
ఆనందంగా సాగిన జీవితం...
అప్పటివరకు ఆనందం సాగిన జీవితం కళ్ల ముందే కూలిపోతుందని తెలిసినప్పుడు ఓ భార్య పడే వేదనను చూపించారు. మరోవైపు భర్త దూరమయ్యాడనే వాస్తవాన్ని తలుచుకుంటూ బతుకుతోన్న ఓ ఇల్లాలి ముందు హఠాత్తుగా మరో రూపంలో అతడు తిరిగి వచ్చినప్పప్పుడు ఆ వాస్తవాన్ని అంగీకరించాలా వద్దా అనే సందిగ్ధతను ఆవిష్కరించారు. ఈ ఇద్దరి ఉద్వేగాల్ని ఒకే ఫ్రేమ్‌లో చూపించే కెమెరా ఫ్రేమ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.
తమిళ్ డైలాగ్స్...
జేమ్స్ వేలంకిని మాతను దర్శించుకొని తన ఆప్తులతో కలిసి తిరుగు ప్రయాణమయ్యే సీన్‌తో ఈ సినిమా మొదలవుతుంది. తమిళ ఫుడ్‌ను, ప్రజల్ని ద్వేషించే జేమ్స్ జర్నీ మధ్యలోనే బస్ దిగి ఓ ఊరికి వెళ్లే సీన్‌తో కొత్త మలుపు తిరుగుతుంది.
ఆ తర్వాత పూర్తిగా తమిళ వ్యక్తిగా జేమ్స్ ప్రవర్తించడం, అతడిని తీసుకెళ్లడానికి బంధువులు చేసే ప్రయత్నాలు చుట్టూ సినిమా చివరి వరకు సాగుతుంది. తమిళ నేటివిటీని రియల్‌గా చూపించడానికి తమిళ భాషనే సినిమాలో వాడారు దర్శకుడు. అందుకే సగం తమిళంలో, సగం తెలుగులో డైలాగ్స్ వినిపిస్తాయి.
మమ్ముట్టి పరకాయ ప్రవేశం
జేమ్స్, సుందరంగా రెండు షేడ్స్‌తో కూడిన పాత్రల్లో మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేశారు. ప్రయోగాత్మక పాత్రలో అతడి నటన, వేరియేషన్స్ చూపించిన విధానం అద్భుతం. అతడి క్యారెక్టర్‌కే సినిమాలో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా టేకింగ్, మేకింగ్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది.
Nanpakal Nerathu Mayakkam Review-ఆర్ట్ సినిమా
రెగ్యులర్ కమర్షియల్ కొలతలతో చూస్తే నాన్ పకల్ నేరత్తు మయక్కం సినిమా మెప్పించడం కష్టమే. ఆర్ట్ సినిమాల్ని ఇష్టపడేవారిని మెప్పిస్తుంది. మమ్ముట్టి యాక్టింగ్ కోసం చూడొచ్చు.