Naa Saami Ranga Nagarjuna: చిట్టీలు రాసి ఇంట్లో పడేశారు: నాగార్జున
14 January 2024, 23:45 IST
- Naa Saami Ranga Movie - Nagarjuna: నా సామిరంగ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై హీరో నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. నేడు ఈ మూవీ టీమ్.. థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడారు.
Naa Saami Ranga Movie: దర్శకుడు విజయ్ బిన్నీ, అల్లరి నరేశ్, అషికా రంగనాథ్‍తో నాగార్జున
Naa Saami Ranga Movie - Nagarjuna: సీనియర్ హీరో కింగ్ నాగార్జున ప్రధాన పాత్ర పోషించిన ‘నా సామిరంగ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా నేడు (జనవరి 14) ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ నా సామిరంగ సినిమాతో దర్శకుడిగా మారాడు. పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కించాడు. నా సామిరంగ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ తరుణంలో నేడు థ్యాంక్స్ మీట్ నిర్వహించి మూవీ టీమ్.
నా సామిరంగ సినిమా థ్యాంక్స్ మీట్‍లో హీరో నాగార్జున, అల్లరి నరేశ్, హీరోయిన్ అషికా రంగనాథ్, దర్శకుడు విజయ్ బిన్నీ సహా మరికొందరు పాల్గొన్నారు. ఈ మీట్‍లో నాగ్ మాట్లాడారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనకు సంతోషం వ్యక్తం చేశారు. ‘నా సామిరంగ’ మూవీ నచ్చిందని కొందరు చిట్టీలు రాసి గోడపై నుంచి తమ ఇంట్లోకి వేస్తున్నారని నాగార్జున అన్నారు.
తన అభిమానులు నా సామిరంగ సినిమాతో చాలా సంతోషంగా ఉన్నారని నాగార్జున చెప్పారు. “మమ్మల్ని ఎంతగానో ఆదరించిన రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ధన్యవాదాలు. చాలాచాలా హ్యాపీగా ఉన్న నా అభిమానులందరికీ థాంక్యూ వెరీ మచ్. నరేశ్‍కు ఎలా చెప్పారో.. నాకు కూడా అలాగే ఫోన్లు, చేసి మెసేజ్‍లు పంపించి చెబుతున్నారు. గోడపై నుంచి కూడా చిట్టీలు రాసి ఇంట్లో పడేశారు. ఇలాంటి సినిమాలు కావాలని చెప్పారు. వారి ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా, తృప్తిగా ఉంది” అని నాగార్జున అన్నారు.
నా సామిరంగ మూవీలో యంగ్ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా కీలకపాత్రలు పోషించారు. కోనసీమలో 1980ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన అషికా రంగనాథ్, అల్లరి నరేశ్‍కు జోడీగా మిర్నా మీనన్, రాజ్ తరుణ్ సరసన రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. నాజర్, షబీర్ కల్లరకల్లల్, రవివర్మ, రావు రమేశ్ కీరోల్స్ చేశారు.
‘నా సామిరంగ’ మూవీకి అస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. పాటలు ఈ చిత్రానికి మంచి ప్లస్ అయ్యాయి. కొరియోగ్రాఫర్‌గా ఫేమస్ అయిన విజయ్ బిన్నీ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి పండుగకు సూటయ్యేలా పక్కా విలేజ్ కమిర్షియల్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ మూవీకి డైలాగ్స్ రాశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించారు.
ఇదీ స్టోరీ బ్యాక్‍డ్రాప్..
కిష్టయ్య (నాగార్జున)ను గ్రామ ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్) చేరదీస్తారు. మహాలక్ష్మి ‘వరాలు’ (అషిక రంగనాథ్)ను చిన్నప్పటి నుంచే కిష్టయ్య ప్రేమిస్తాడు. ఆమెకు కూడా అతడిని ప్రేమిస్తుంది. అయితే, కొన్ని కారణాల వల్ల వారు విడిపోవాల్సి వస్తుంది. కిష్టయ్యకు సోదరుడిగా అంజి (అల్లరి నరేశ్) ఉంటాడు. అయితే, కిష్టయ్య, అంజిని చంపాలని పెద్దయ్య కుమారుడు దాసు (షబీర్) పగబడతాడు. వారి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి .. కిష్టయ్య, వరాలు ప్రేమ గెలిచిందా.. భాస్కర్ (రాజ్ తరుణ్)కు వీరితో సంబంధం ఏంటనేదే నా సామిరంగ మూవీ ప్రధాన కథగా ఉంది.