Bigg Boss 6: వామ్మో.. నాగార్జున రెమ్యునరేషన్ ఇంత భారీగానా?
22 August 2022, 11:43 IST
- Bigg Boss 6: బిగ్ బాస్ 6 సీజన్ వచ్చేస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ కొత్త సీజన్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ ఈ మధ్యే ప్రోమోతో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నాగార్జున రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది.
బిగ్ బాస్ షోతో బాగానే సంపాదిస్తున్న నాగార్జున
ఇండియాలో ఏ భాష అయినా బిగ్ బాస్ అంటే చాలు షో హిట్టయిపోతుంది. హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో.. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషల్లోకీ వచ్చింది. అన్ని భాషల్లోనూ ఈ షోకి ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. ఒకే ఇంట్లో కొందరు సెలబ్రిటీలు కొన్ని రోజుల పాటు ఉండటం.. వాళ్ల పనులు వాళ్లే చేసుకోవడం, మధ్యమధ్యలో గేమ్స్.. ఇలా ఈ షో అభిమానులను బాగానే ఆకర్షించింది.
తెలుగులో తొలి ఐదు సీజన్లు హిట్ టాక్ సంపాదించాయి. మూడో సీజన్ నుంచి ఈ షోకి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే మూడు సీజన్లు హోస్ట్‌గా ఉన్న అతడు.. ఇప్పుడు ఆరో సీజన్‌కు రెడీ అయిపోయాడు. అయితే బిగ్ బాస్ 6 సెప్టెంబర్ 4న వస్తోంది అన్న వార్త కంటే కూడా ఇప్పుడీ షో కోసం నాగార్జున తీసుకుంటున్న రెమ్యునరేషన్‌పైనే ఎక్కువ చర్చ నడుస్తోంది.
గతేడాది ఐదో సీజన్‌లో నాగార్జున ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.12 లక్షలు వసూలు చేశాడు. ఆ లెక్కన ఆ సీజన్ మొత్తం కలిపి రూ.12 కోట్లు అతని ఖాతాలో చేరాయి. బిగ్ బాస్‌కు నాగార్జున హోస్ట్‌గా ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ అన్న టాక్ వచ్చింది. దీంతో ఇప్పుడీ ఆరో సీజన్ కోసం నాగ్ తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు సమాచారం. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సీజన్ మొత్తానికి కలిపి నాగార్జునకు రూ.15 కోట్లు దక్కనున్నట్లు సమాచారం.
దీనిపై అధికారిక ప్రకటన ఏదీ ఇంకా రాలేదు. అయితే ఇదే నిజమైతే మాత్రం ఇది భారీ మొత్తమే. అతని సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్‌లాంటి షోలతో నాగ్ ఇంత భారీగా సంపాదించడం నిజంగా విశేషమే. బుల్లి తెరపై అతని సక్సెస్ మరింత మంది పెద్ద హీరోలను ఆ వైపుగా చూసేలా కూడా చేస్తుందనడంలో సందేహం లేదు.