Sita Ramam Success Meet: సీతారామం చూసి మృనాల్‌తో ప్రేమలో పడ్డాను: నాగార్జున
Sita Ramam Success Meet: అందరి అంచనాలను అందుకుంటూ సీతా రామం మూవీ సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగానూ విజయవంతంగా ముందుకెళ్తున్న ఈ మూవీ సక్సెస్ మీట్ గురువారం (ఆగస్ట్ 11) హైదరాబాద్‌లో జరిగింది.
దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్, రష్మికా మందన్నా లీడ్ రోల్స్‌లో నటించిన సీతా రామం మూవీ ఈ నెల 5న రిలీజైన విషయం తెలుసు కదా. ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చినా ఈ లవ్‌స్టోరీని ఎంతో అందంగా చూపించడంలో హను రాఘవపూడి సక్సెస్ అయ్యాడని ప్రేక్షకులు తేల్చేశారు.
మూవీ ఊహించినదాని కంటే సూపర్ సక్సెస్ కావడంతో మేకర్స్ గురువారం (ఆగస్ట్ 11) సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి చీఫ్ గెస్ట్‌గా అక్కినేని నాగార్జున వచ్చాడు. దుల్కర్, మృనాల్‌లతోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి, నిర్మాత అశ్వినీ దత్ ఈ మీట్‌కు హాజరయ్యారు. దుల్కర్ ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించగా.. మృనాల్ ప్రింటెడ్ ఫ్లోరల్ లెహెంగాలో చాలా క్యూట్‌గా అనిపించింది.
ఈ మూవీ సక్సెస్ మీట్‌లో దుల్కర్ మాట్లాడుతూ.. హను రాఘవపూడి రుణం తీర్చుకోలేనని అన్నాడు. ఈ మూవీ అన్ని భాషల సరిహద్దులను చెరిపేసిందని, తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీల్లోనూ సక్సెసైందని చెప్పాడు. నిజానికి తన కంటే సీతామహాలక్ష్మి క్యారెక్టర్ చేసిన మృనాల్‌ను చూడటానికే భారీగా థియేటర్లకు వస్తున్నారని దుల్కర్ అనడం విశేషం. ఇక చివర్లో తాను నెక్ట్స్ టైమ్ తెలుగులో మాట్లాడతా అని తెలుగులోనే చెప్పి ముగించాడు.
ఈ సక్సెస్ మీట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన నాగార్జున మాట్లాడుతూ.. తన రోల్ దుల్కర్ తీసుకెళ్లినందుకు జెలసీగా ఉందని అన్నాడు. సీతా రామం చూస్తుంటే తన పాత సినిమాలు గీతాంజలి, సంతోషం, మన్మథుడులాంటివి గుర్తొచ్చాయని చెప్పాడు. ప్రేమకథలు నచ్చితే ప్రేక్షకులు చూస్తూనే ఉంటారని, అవి క్లాసిక్‌గా మిగిలిపోతాయని నాగార్జున అన్నాడు. సీతా క్యారెక్టర్‌ను చూపించిన తీరు చాలా అందంగా ఉందని, ఎవరు చూసినా ఆ క్యారెక్టర్‌తో ప్రేమలో పడాల్సిందేనని, ఐ లవ్యూ మృనాల్ అని స్టేజ్‌పైనే ఉన్న హీరోయిన్‌తో అన్నాడు నాగార్జున.
తెలుగులో ఎంతో మంది యువ హీరోలున్నా దుల్కర్‌ను ఎందుకు ఎంచుకున్నారని డైరెక్టర్ హనుని అడగగా.. ఈ క్యారెక్టర్‌కు అతడే మాత్రమే సరిపోతాడని తాను భావించానని, ఇప్పుడు చూసిన వాళ్లు కూడా అదే చెబుతున్నారని అన్నాడు. రొమాంటిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సీతా రామం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్లు రాబట్టడం విశేషం.