Sita Ramam: ఇదే నా చివరి లవ్‌స్టోరీ: దుల్కర్ సల్మాన్
Sita Ramam: మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ సీతా రామం మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌లో అతడు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఫిల్మ్ ఇండిస్ట్రీలో ఇప్పుడు ఎంతో ఆసక్తి రేపుతున్న సినిమా సీతా రామం. దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్, రష్మికా మందన్నా నటించిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం (జులై 25) రిలీజైంది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచింది. ఇదో అందమైన ప్రేమకథగా తెరకెక్కిన సినిమా.
అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడిపడి లేచే మనసులాంటి లవ్‌స్టోరీలను తెరకెక్కించిన హను రాఘవపూడి.. మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రొమాంటిక్ హీరోగా పేరుగాంచిన దుల్కర్ సల్మాన్‌తో లవ్‌స్టోరీ తీస్తే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. అయితే ట్రైలర్ లాంచ్‌లో తనపై ఉన్న ఈ రొమాంటిక్ హీరో ముద్రపై దుల్కర్ స్పందించాడు.
ఇది వినీవినీ అలసిపోయానని, ఇక లవ్ స్టోరీలు చేయకూడదని అనుకున్న సమయంలో హను రాఘవపూడి చెప్పిన స్టోరీ విని కాదనలేకపోయానని చెప్పాడు. "ఈ కథ చాలా అందంగా, అద్భుతంగా ఉండటంతో చేయాలని నిర్ణయించుకున్నా. కానీ ఇదే నా చివరి లవ్‌స్టోరీ కావచ్చు. హను ఓ మంచి అభిరుచి కలిగిన ఫిల్మ్ మేకర్. మేము చాలా అందమైన లొకేషన్లకు వెళ్లాం. గతంలో నేనెప్పుడూ వెళ్లలేదు. సినిమాలోని క్యారెక్టర్లతో ఎంతగా కనెక్ట్ అయ్యామంటే మేమంతా ఆ పేర్లతోనే పిలుచుకునేవాళ్లం" అని దుల్కర్ చెప్పాడు.
ఈ మూవీలో సీతా, రామ్ లవ్‌స్టోరీని నెరేట్ చేసే క్యారెక్టర్‌లో రష్మిక మందన్నా నటించింది. మొదట్లో ఈ క్యారెక్టర్ తాను చేస్తానో లేదో అనిపించిందని, కానీ ఇప్పుడు బాగానే చేశానని అనుకుంటున్నట్లు రష్మిక చెప్పింది. ఈ సీతా రామం మూవీ వచ్చే నెల 5న రిలీజ్ కానుంది.